బాధిత భర్తలకు కష్టకాలం..స్టేషన్ బెయిల్ రద్దు!

 

పోలీసు శాఖలో అవినీతిని అరికట్టేందుకు కేంద్ర న్యాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే స్టేషన్ బెయిల్ ను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇకపై నేరస్తులు స్టేషన్ లో బెయిల్ తీసుకునేందుకు వీలు లేదని, కోర్టుల ద్వారా మాత్రమే వారు బెయిల్ ను పొందాలని నిబంధనల్లో మార్పులు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఫైనల్ డెసిషన్ తీసుకున్న న్యాయ శాఖ CRPC 41A ను సవరించింది.

అయితే తీవ్రమైన నేరాలు చేసిన వారి విషయంలో ఇది సరైన నిర్ణయంగానే అనిపిస్తున్నా ఆచరణలో మాత్రం ఇందులో చాలా ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా గృహహింస కేసుల్లో తప్పుడు కేసులకు బలైపోతున్న భర్తలకు స్టేషన్ బెయిల్ అనేది కాస్త ఊరట కలిగిస్తోంది. ఇప్పుడు దాన్ని కూడా రద్దు చేస్తే తప్పుడు కేసులతో బరి తెగించే కొందరు మహిళకు ఇది బ్రహ్మాస్త్రంగా మారుతుంది. కేవలం వేధింపులే పరమావధిగా చాలా మంది భార్యలు తమ భర్తలపై అతని కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులను బనాయిస్తున్నారు. మహిళా చట్టాలను వేధింపులకు అస్త్రాలుగా మలుచుకుని పేట్రేగిపోతున్నారు.

గతంలో ఇలాంటి తప్పుడు కేసులు బనాయించే భార్యల బారి నుంచి చాలా మంది భర్తలను స్టేషన్ బెయిల్ కాపాడేది. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకు ఊరట కలిగించే విధంగా ఉండేది. ఇప్పుడు తీవ్రమైన నేరస్తులను కట్టడి చేసేందుకు మొత్తంగా స్టేషన్ బెయిల్ ను తొలిగిస్తే గృహహింస కేసుల్లో పరిస్థితి తీవ్రత మళ్లీ మొదటికొస్తుంది. ముఖ్యంగా అన్యాయంగా పోలీస్‌ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కామన్న బాధతో, వేదనతో చాలా మంది భర్తలు అతని కుటుంబ సభ్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తీవ్రమైన నేరాల్లో, సివిల్ తగాదాల్లో స్టేషన్ బెయిల్ ను రద్దు చేసినా ఫర్వాలేదు కానీ కుటుంబ కలహాల్లో స్టేషన్ బెయిల్ ను రద్దు చేయకుండా ఉంటేనే మంచిది. లేదంటే అది మరిన్ని విపరిణామాలకు దారితీస్తుంది.