కరోనా వస్తే చావు తప్పదా? ప్రపంచం ఎందుకింత భయపడుతోంది?

ఇప్పుడు ఏ ఇద్దరి మధ్య ఏ చిన్న సంభాషణ జరిగినా అది కరోనా వైరస్ గురించే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారానికి తోడు పుకార్లు, బాధ్యత లేని ఫార్వార్డ్ మెసెజ్ లు అందరిలో మరింత భయాన్ని పెంచుతున్నాయి. ఏ ఒక్కరికీ సరైన అవగాహన లేకపోవడం ఒక కారణం అయితే అతిగా ఆందోళనకు గురికావడం కూడా పరిస్థితిని సంక్షిష్టంగా మారుస్తోంది. నిజమే కరోనా ప్రమాదకరమైనదే అందులో సందేహం లేదు. కానీ గతంలో మనం ఎదుర్కొన్న ఇతర వైరస్‌ ల కంటే ఇది ప్రమాదకరమా అంటే ..కచ్చితంగా కాదు అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో వచ్చిన సార్స్, స్వైన్‌ప్లూ లతో పోల్చుకుంటే కరోనా వైరస్ తో సంభవించిన మరణాల రేటు చాలా తక్కువ. కానీ గతంలో వచ్చిన వైరస్ లకు కరోనా కు మధ్య ముఖ్యమైన తేడా ఏంటంటే. ..కరోనాలో వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. దీన్ని మాత్రమే మనం ప్రమాదకరంగా భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు చైనా సహా మిగిలిన వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉన్న దేశాలు అత్యవసరంగా చేస్తున్న పని అదే. కొత్త వ్యక్తులకు వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడం.

కరోనాకు మందు లేదు కదా? మరి ఎలా?

అవును కరోనాకు మందు లేదు. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకూ చాలా వైరస్ లకు మనం వ్యాక్సిన్ ను కానీ పూర్తిగా నివారించే పద్ధతులను కానీ కనిపెట్టలేదు. ఇది ఆందోళన కలిగించే విషయం. కరోనా వైరస్ వ్యాప్తిలో చాలా విచిత్రమైన అంశాలున్నాయి. ఇతర ప్రమాదకరమైన వైరస్ లతో పోల్చుకుంటే కరోనా అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ వ్యాప్తితో మరణాలు సంభవిస్తున్నప్పటికీ ఇతర వైరస్ లతో పోల్చుకుంటే చాలా తక్కువ. హెచ్‌ఐవీ, మిజిల్స్, సీజనల్ ఫ్లూ, యెల్లో ఫీవర్ వంటి వైరస్ లతో పోల్చుకుంటే కరోనా వైరస్ సోకి చనిపోయినవారు తక్కువే అని చెప్పాలి. మరి ఎందుకు దీని కోసం ఇంతలా భయపడుతున్నారు. అంటే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందడమే. అది మాత్రమే కరోనా విషయంలో ఆందోళన చెందాల్సిన విషయం. కొన్ని రోజులు స్వీయ ఐసోలేషన్, వ్యక్తిగత పరిశుభ్రత, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం , రోగనిరోధర శక్తిని పెంచుకునేందుకు సమతుల ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ ను తరిమికొట్టొచ్చు. గడిచిన వారం రోజులుగా సోషల్ మీడియాలో కరోనా వైరస్ కోసం ఎవరికి తోచిన విషయాలు వారు చెపుతూ వాట్సాప్ , ఫేస్‌బుక్ లను హోరెత్తిస్తున్నారు. అందులో కొన్ని మాత్రమే పాటించదగ్గవి. మిగిలిన వ్యాఖ్యానాలు అన్నీ ఎందుకూ పనికిరానివి.

కరోనాతో చనిపోయిన వారు 0.2 శాతం కూడా లేరు!

ముఖ్యమైన విషయం ఏంటంటే కరోనాతో వ్యాప్తి చెందడంలోనే ప్రమాదకరమైనది. సార్స్, సీజనల్ ఫ్లూ వంటి ప్రమాదకమైన వైరస్ లతో పోల్చుకుంటే ఇది మనుష్యులను చంపే రేటు తక్కువ. దీని కోసం భయపడటం. ఆ భయాన్ని అందరికీ వ్యాప్తి చేయడమే ఇప్పుడు మరింత ప్రమాదకరం. ఈ కింది చార్ట్ ఒక సారి చూడండి. భయకరంమైన ఇతర వైరస్ లతో పోల్చుకుంటే కరోనా వైరస్ సంభవించిన మరణాల రేటు.

ఒకసారి ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి మరణించిన వారి వివరాలు చూస్తూ మనకు ఒక విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. కాస్త వయస్సు మళ్లిన వారు, ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మాత్రమే ఈ వైరస్ సోకి మరణించారు. రికార్డులు ఈ విషయాన్ని స్పష్టంగా చెపుతున్నాయి.

 

మాస్క్ లు వాడితే కరోనా రాదా?

మాస్క్ ల విషయంలో కూడా ప్రస్తుతం ఎవరికీ సరైన అవగాహన ఉండటం లేదు. అసలు కరోనా గాలి ద్వారా వ్యాప్తి చెందడం లేదు. అది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకుతుంది. అంటే ఎవరైనా తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వారి నుంచి పక్కవారికి ఇది సక్రమిస్తుంది. అలాంటి సమయంలో మాస్క్ లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. అయితే మనకు ప్రస్తుతం మెడికల్ షాప్ లో దొరుకుతున్న మాస్క్ లు సర్జికల్ మాస్క్ లు మాత్రమే. వాటిని మనం గంట నుంచి రెండు గంటలు మాత్రమే వాడేందుకు వీలుంది. వీటిని డాక్టర్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే తన నుంచి రోగికి ఎటువంటి ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉంటేందుకు దీన్ని ధరిస్తారు. అలాంటి సర్జికల్ మాస్క్ లను ఇప్పుడు బ్లాక్ లో కొనుక్కుని రోజంతా వాడితే సరైన ఫలితాలు రావు. పైగా నెగెటివ్ ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. వైరస్ లను అడ్డుకునేందుకు ప్రభావవంతంగా అడ్డుకునేందుకు N95 మాస్క్ లను వాడాల్సి ఉంటుంది. కానీ అవి ఎక్కడా అందుబాటులో దొరకకడం లేదు. మరోవైపు సర్జికల్ మాస్క్‌లు వాడి వాటిని తొలిగించేటప్పుడు ముందు భాగంను తాకుతూ తొలిగిస్తే మన చేతులకు మరిన్ని వైరస్ లు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే సరియైన మాస్క్‌లు, అంటే N95 లేకుంటే సర్జికల్ మాస్క్ లు ( ఒకటి రెండు గంటలు మాత్రమే) వాడుతూ, చేతులను శుభ్రంగా 20 సెకన్ల పాటు కడుక్కొవడం, అలాగే ఏదీ టచ్ చేయకుండా ఉండటం, చేతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కు, నోరు, కళ్లలో పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఏదైనా టచ్ చేసిన వెంటనే ఆల్కహాల్ బేస్‌డ్ శానిటైజర్ తో చేతిని శుభ్రం చేసుకుంటే కరోనాను నివారించవచ్చు.

కావాల్సినవి పుకార్లు కాదు పరిష్కారాలు!

ఇప్పటి వరకూ మానవ జాతి ఎన్నో విపత్తులను ఎదుర్కొంది. మన పుట్టుకే ఒక యుద్ధం. ప్రతీ రోజూ వందలాది వైరస్ లతో యుద్ధం చేస్తున్నాం. ఇంకా చేస్తాం. ఇప్పటికే మనల్ని పట్టి పీడిస్తున్న అనేక వైరస్ లతో కరోనా అన్నది మరొక కొత్త వైరస్. దానితో మనం పోరాటం చేయాల్సిందే. ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుని ప్రభుత్వాలు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలి. ప్రజలుకూడా పుకార్లను , భయాలను వ్యాప్తి చేయకుండా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయాలి. కరోనా కేసులు నమోదైనప్పటికీ పటిష్ట చర్యలతో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న సింగపూర్ ప్రధాని మాటలు ఒకసారి వినండి.

https://youtu.be/zlctqyeGSps

 

భయం ఆరోగ్యంగా ఉన్నవాడిని కూడా చంపేస్తుంది. ధైర్యం చావు బతుకుల్లో ఉన్న వాడిని కూడా బతికిస్తుంది. సింగపూర్ ప్రైమ్ మినిష్టర్ లీ సెన్ లూంగ్ చెప్పినట్టు ఇప్పుడు కావాల్సింది భయం కాదు పోరాటం. ఎందుకంటే భయం కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనది.

వెంకట్ కంబాల, మేనేజింగ్ ఎడిటర్
mrktelugu.com