తిట్లు, వెక్కిరింతలు ప్రసంశలుగా మారిన విధంబెట్టిదనిన!

మార్చి మొదటి వారంలో అనుకుంటా ట్రోల్స్ లో ఎక్కడా చూసినా ఏపీ సీఎం జగన్, తెలంగాణా సీఎం కేసీఆర్ కామెంట్లే. కరోనాపై బ్లీచింగ్ పౌడర్ చల్లాలి అని జగన్..పారా‌సెటమాల్ గోళీ వేసుకుంటే చాలు అంటూ కేసీఆర్ డాక్టర్‌గిరీ చూసి చాలా మంది నవ్వుకున్నారు. తర్వాత వైరస్ మెల్లగా పెరగడంతో కేసీఆర్ హితవచనాలు, కుటుంబ పెద్ద ప్రెస్‌మీట్లు అతని ఇమేజ్‌ ను అమాంతం పెంచాయి. ఇటువైపు జగన్ ప్రెస్‌మీట్లు పేలవంగా చప్పగా సాగాయి. మే నెల కల్లా కరోనాను మట్టి కరిపిస్తా అని కేసీఆర్ శపధం చేయడంతో అసలు ఇలాంటి సీఎం ఆంధ్రాకు ఎందుకు లేడు అనుకుంటా కొందరు తెగ బాధపడిపోయారు. ఇక జగన్ వ్యతిరేకులు అయితే ఒకట్రెండు అడుగులు ముందుకేసి జగన్ కు పాలన చేతకాదని తేల్చిపారేసారు.

కట్ చేస్తే మే నెల చివరినాటికి కేసీఆర్ మాటల మెహర్బానీ చేతల్లో జై తుస్ అన్న చేదు వాస్తవం ప్రజలకు మెల్లగా అర్ధమైంది. దొరవారు షరామామూలుగానే ఫామ్ హౌస్ వేదికగా పత్తా లేకుండా పోయిండు. మొత్తం తెలంగాణాకు ఒక్కటే గాంధీ హాస్పటల్. ప్రజల ప్రాణాలు పిట్లల్లా రాలుతున్నా దొర మాత్రం కానరాలేదు. మాటల్లో కోటలు దాటించిన గొప్పలు…ఊపిరిని అందించే ఆక్సిజన్ ను కూడా అందివ్వలేకపోయాయి. ఒకవైపు గిఫ్ట్ లు ఇస్తా లేరని టెస్ట్‌ లు నిలిపివేత. మరోవైపు ఆక్సిజన్, సమయానికి సరైన చికిత్స అందక రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇటు టెస్ట్‌ లు చేయక.. అటు ఊపిరి అందకుంటే హాస్పటల్ లో బెడ్డు దొరక్క దొర మాటల మత్తులో చిక్కుకున్న ప్రజలకు హ్యాంగోవర్ మొత్తం దిగిపోయింది. తమను గాలికొదిలేసారనే చేదు నిజం అర్ధమయ్యాక అయ్యగారు చెప్పినట్టు బతికుంటే బలుసాకు తినొచ్చని హైదరాబాద్ ఖాళీ చేసి సొంతూళ్ల బాట పట్టారు.

ఇటు జగన్ వైపు వస్తే ప్రెస్‌మీట్లలో చప్పగా మాట్లాడిన జగన్ చేతల్లో మాత్రం సత్తా చూపారు. పాలనానుభవం లేకపోయినా కరోనా కట్టడిలో దూకుడు ప్రదర్శించారు. దేశంలోనే అత్యధికంగా టెస్ట్‌లు చేసి ఔరా అనిపించుకున్నారు. బస్‌లను టెస్టింగ్ సెంటర్‌లుగా మార్చి టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానంలో నిపుణుల సలహాలను పాటించారు. పైగా దేశంలోనే తొలిసారిగా కరోనా ట్రీట్‌మెంట్ ను ఆరోగ్య‌శ్రీ లో చేర్చి శభాష్ అనిపించుకున్నారు. మొదట్లో ఇదే జగన్ కరోనాతో సహజీవనం అంటే ఎగతాళి చేసిన వారు ఇప్పుడు అదే నిజమన్న కఠిన వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. ఏపీలో కేసులు భారీగా పెరుగుతున్నా అధిక టెస్ట్‌లు చేయడం వలన వచ్చే రెండు మూడు నెలల్లో మంచి ఫలితాలు వస్తాయి. మాటల గారడీని కాకుండా చేతల గారడీని నమ్ముకోవడం అన్నది జగన్‌ కు మేలు చేసింది. లేదంటే ఆ విపత్తు సమయంలో అతని పాలనపై బ్లాక్‌ మార్క్ కచ్చితంగా పడి ఉండేది. కరోనా కట్టడిలో ఇప్పుడే జగన్ విజయం సాధించేసారని చెప్పడం కాదు ఇక్కడ ఉద్దేశం. ఒక ప్రణాళిక ప్రకారం పెను సంక్షోభాన్ని ఎదురొడ్డి నిలబడటంలో వాస్తవ దృక్ఫధంతో ముందడుగు వేయడం. అందుకే కేవలం రెండు నెలల కాలంలోనే విమర్శకుల నుంచి కూడా జగన్ ప్రసంశలు పొందుతున్నాడు. ఇప్పుడు కావాల్సింది అదే. ప్రజల్ని మభ్యపెట్టే మాటల గారడీ కాదు.

Mr.K