ఇతని కథ చదవండి..కష్టాల్ని ధైర్యంగా ఎదిరించండి!!

 

ప్రస్తుతం చాలా మంది చాలా చిన్న చిన్న సమస్యలకే బెదిరిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. అప్పులు పెరిగిపోయాయనో, అనారోగ్యం వేధిస్తుందనో, ప్రేమ వైఫల్యాలో, నమ్మిన వారు మోసం చేసారనో ఇలా ఎన్నో కారణాలు. జీవితం చాలా విలువైందని ఎన్ని కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదిరించి పోరాటం చేయడమే నిజమైన ధీరత్వం అని మర్చిపోతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కథ చదివితే ఎవరికైనా కన్నీళ్లు రాకుండా ఆగవు. అదే సమయంలో ఇన్ని కష్టాలున్నా ఇతను ఇంత ధైర్యంగా ఎలా ఉన్నాడు? ఇతనూ మనిషంటే… అని మనలో స్ఫూర్తిని, ధైర్యాన్ని రగిలిస్తాడు.

 

నల్గొండ జిల్లా చెన్నారంలో పుట్టిన చంద్రమౌళి పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టాడు. అక్కడే అతనికి విధి తొలి పరీక్ష పెట్టింది. అయినా వెరవకుండా ధీరత్వంతో కాళ్లు పనిచేయకున్నా ఒక పంక్చర్ దుకాణంలో పనిచేస్తూ ఆత్మగౌరవంతో బతికాడు. ఒక మూడు చక్రాల వాహనాన్ని తయారు చేసుకుని దాని సహాయంతో షాప్ కు వెళ్లి పనిచేసేవాడు. పుట్టుకతోనే మూగ అయిన రేణుకను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. దంపతులు ఇద్దరూ దివ్యాంగులైనా ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేస్తూ జీవితాన్ని వెళ్లదీసేవారు. వారి అందమైన దాంపత్యానికి ప్రతిరూపంగా ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలు పుట్టారు. అమ్మాయి పేరు కావ్య, అబ్బాయి పేరు ప్రకాష్ అని పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. సరిగ్గా ఇక్కడే మరోసారి విధి చంద్రమౌళిని దారుణంగా దెబ్బతీసింది. ఒక శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఒక ప్రయివేట్ ట్రావెల్స్ బస్ చంద్రమౌళి కుటుంబం ప్రయాణిస్తున్న మూడు చక్రాల వాహనాన్ని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో చంద్రమౌళి భార్య రేణుక, కొడుకు ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రమౌళి స్వల్పగాయాలతో బయటపడినా కూతురు కావ్య తీవ్రంగా గాయపడింది.

 

కొన్ని రోజుల చికిత్స తర్వాత కావ్యకు ఒక కాలు తొలిగించాలని డాక్టర్స్ చెప్పారు. ఒకవైపు అంగవైకల్యం, మరోవైపు భార్యా కొడుకు మరణం, మరోవైపు తన కూతురు కూడా ఇప్పుడు అంగవైకల్యంతో బతుకు వెళ్లదీయాల్సిన దుస్థితి. ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎంతటి ధైర్యవంతుడైనా ఒక్కసారిగా నీరుగారిపోతాడు. జీవితంపై ఆశలు వదులుకుంటాడు. కానీ చంద్రమౌళి అలా ఆలోచించలేదు. తను బతకాలి, తన కూతున్ని బతికించాలి. తన కూతురికి మంచి చికిత్స చేయించాలి. కానీ డబ్బులు ఉండాలిగా. అందుకే కలెక్టరేట్ లో జరిగే ప్రజావాణికి వచ్చి తన సమస్యను కలెక్టర్ కు విన్నవించాడు. తక్షణం స్పందించిన కలెక్టర్ కావ్యకు కృత్రిమ కాలు అమర్చడంతో పాటు ఫించన్ వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

 

ఇక్కడ చంద్రమౌళి కథను అందరూ చదవాలి. జీవితం ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎన్ని కష్టాలు ఎదురైనా బతకాలి, బతికి తీరాలి. అన్న అతని స్ఫూర్తి ఏ సోకాల్డ్ మోటివేషనల్ స్పీకర్ ఇవ్వగలడు. హ్యాట్సాప్ చంద్రమౌళి. నీ కంటే పెద్ద మోటివేషనల్ స్పీకర్ ఎవరూ లేరు. కష్టాల్ని ఎదిరించి జీవితం జీవించడానికే అన్న నీ కథ చదివి అయినా ఒక్కరైనా మారితే అది నీ ఘనతే.