పంచ్‌లు, ప్రాసలు, శాపనార్ధాలు, వెటకారాలు కాదు… భరోసా కావాలి దొరా!

“కరోనా, గిరోనా లేదు…జ్వరానికి వేసుకునే ఆ గోలీ పేరు ఏంది? ఆ..పారసెటమాల్. అది వేసుకుంటే సరిపోద్ది. దానికి ఇంత పంచాయితీ ఎందుకు?”

“తెలంగాణలో కరోనా ను ఎదుర్కొనేందుకు ఎంత దూరమైనా వెళ్తాం. ఎంత ఖర్చు అయినా భరిస్తాం. అవసరమొస్తే పక్క రాష్ట్రాలకు సహాయం చేసే పరిస్థితుల్లో ఉన్నాం.”

ఈ రెండింటి ప్రకటనల మధ్యలో ఎన్నో పంచ్‌లు, ప్రాసలు, బెదిరింపులు, శాపనార్ధాలు, వెటకారాలు… అయినా సరే ప్రజలు తెలంగాణా సీఎం కేసీఆర్‌ పక్షానే నిలిచారు. కరోనా విపత్తు వేళ ఆయన ప్రెస్‌మీట్లు తమలో ధైర్యం నింపుతున్నాయని, ఆయన మాటలు కుటుంబ పెద్దను గుర్తు చేస్తున్నాయని టీఆర్‌ఎస్ అభిమానులే కాదు, సామాన్య ప్రజలు కూడా ఆనందపడ్డారు. కానీ వైరస్ తీవ్రతరమవుతున్న వేళ మాటలు కోటలు దాటాయి కానీ చేతలు కనీసం అంగుళం కూడా దాటి వెళ్లలేదు. ఏభై , వంద కేసులు ఉన్నప్పుడు కరోనా అంతు చూస్తాం..మీకు మేమున్నాం అన్న గొప్పలు ..కేసులు వేలల్లో నమోదవుతున్న వేళ పలాయనంగా మారుతున్నాయి.

గడిచిన వారం రోజులుగా భయం విస్తరిస్తున్న సంక్లిష్ట సమయంలో ధైర్యాన్ని పంచాల్సిన వీరులు, శూరులు చేతులెత్తేస్తున్న వైనం ఆందోళనను పెంచుతోంది. వైద్య సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని ఎంత ఊదరగొడుతున్నా ఒకవైపు పెరుగుతున్న మరణాలు, మరోవైపు సౌకర్యాల లేమిపై కఠిన నిజాలు కళ్లకు కడుతున్నాయి. తాజాగా ఒక యువ జర్నలిస్టు మృత్యువాత పడటం, అతని సరైన సమయానికి వెంటిలేటర్ సౌకర్యం కల్పించలేకపోవడం వాస్తవంగా ఉన్న దుర్భత పరిస్థితిని వెల్లడించింది. మంత్రికి పీఏ కి కూడా ఫోన్ చేయగలిగే పలుకుబడి ఉన్న ఒక జర్నలిస్ట్‌కే ఇటువంటి గతి పడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న వేదనతో పాటు భయాన్ని కూడా కలిగిస్తోంది.

చనిపోయిన వ్యక్తి జర్నలిస్ట్ అన్న విషయాన్ని కాసేపు వదిలేసినా ఒక యువకుడి ప్రాణాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి బతికించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కూడా జరగలేదు. ఒక రోజంతా మొత్తుకుంటే కానీ సాధారణ వార్డు నుంచి ఐసీయుకి తన తమ్ముడ్ని తీసుకెళ్లలేదని వాపోతున్న మృతుడి సోదరుడికి ఎవరు సమాధానం చెపుతారు? వార్డుల్లో రాజ్యమేలుతున్న నిర్లక్ష్యం, అరకొర సౌకర్యాలపై ఇప్పటికే జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. అయినా ప్రభుత్వం మేలుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పైగా ప్రశ్నించిన వారిని ప్రభుత్వ వ్యతిరేకులుగా, అరాచకవాదులుగా చిత్రీకరిస్తున్నారు. సారూ… ప్రశ్నించిన వారిపై దాడి చేసే సమయాన్ని వైద్య సదుపాయాల పెంపుపై వెచ్చిస్తే మరిన్ని ప్రాణాలు పోకుండా కాపాడవచ్చేమో ? కాస్త ఆలోచించండి.

ఇప్పటి వరకూ చనిపోయిన వారంతా ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో చనిపోయారంటూ అయ్యవార్లు సెలవిచ్చారు. అంటే చనిపోయిన వారు షుగర్, బీపీ ట్యాబ్లెట్ వేసుకోకపోవడం వలనే చనిపోయారు అనుకోవాలి కానీ కరోనాతో కాదు. ఇందులో మర్మాన్ని జాగ్రత్తగా గమనిస్తే మంచి యవ్వనంలో ఉండి, శక్తి ఉండి కరోనా వచ్చిన వాళ్లే బతుకుతారు. మిగిలిన వాళ్లకు మా గ్యారంటీ లేదు. మేం ఏం చేయం? మంచిగా డ్రై ప్రూట్స్ ఇస్తాం. తిని బతికిన వాళ్లు బతుకుతారు. పోయిన వాళ్లు పోతారు అన్నదే ఆ వ్యాఖ్యల్లోని మర్మం.

దేశంలోనే ధనిక రాష్ట్రం, మే నెలకల్లా కరోనా రహిత రాష్ట్రంగా చేస్తామని శపథాలు. ఇవేమీ ప్రజలను కాపాడలేకపోతున్నాయి.  ఇంతటి విపత్తు వేళ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన డాక్టర్లను కూడా గాలికొదిలేసారని అర్ధమవుతూనే ఉంది. 4 కోట్ల మంది ప్రజలకు కేవలం ఒకటే కరోనా హాస్పటల్ ఉండటం మన వైద్య ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయన్నది అర్ధమవుతోంది. డాక్టర్లు రొడ్లెక్కారంటే ఇంక ప్రజలను ఎవరు కాపాడుతారు? రాజకీయాల్లో ప్రజలను బోల్తా కొట్టించడానికి వాడే పంచ్‌లు, ప్రాసలు ఇప్పుడు వాళ్లకి అవసరం లేదు. వాళ్లకి కావాల్సింది అంతా బాగుందన్న భరోసా. కాస్త ధైర్యం…అవి ఇవ్వండి సారూ..ప్లీజ్.