వందేళ్ల స్నేహమా..? ఐదేళ్ల రాజకీయమా..?

దేశం అంతా ఎన్నికల వేడి రాజుకుంది. ఏపీలో అయితే ఆ సెగ మరి కాస్త ఎక్కువే ఉంది. తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీల మధ్య ఏపీలో త్రిముఖ పోటీ నెలకొంది. సోషల్ మీడియా పుణ్యమాని గతంతో పోల్చుకుంటే ఇప్పుడు జనాల్లో రాజకీయ చైతన్యం బాగానే పెరిగింది. ఎవరికి ఓటు వేయాలి? ఎవరిని ఎన్నుకోవాలి? అన్నదానిపై ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయాలున్నాయి. కొందరు రావాలి జగన్..కావాలి జగన్ అంటుంటే..మరికొందరు బాబు మళ్లీ రావాలి అంటున్నారు. ఇంకొందరు మార్పు కోసం గాజు గ్లాస్ కు ఓటేయాలి అనుకుంటున్నారు.

ఎదుర్కొన్న అనుభవాలు, బలంగా నమ్మే సిద్ధాంతాలు, రాజకీయ చైతన్యం, చదివే విషయాలు వీటి ఆధారంగా ఒక్కొక్కరు ఒక్కో రాజకీయ నాయకుడికి, రాజకీయ పార్టీకి అభిమానులుగా, అనుకూలురుగా ఉన్నారు. ఇంకొందరికి వ్యతిరేకంగా ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఇది సామాన్యంగా జరిగే విషయమే. అయితే తమ వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలు, బలంగా నమ్మే సిద్ధాంతాలే నిజమని నమ్ముకోవడం వరకు అందరికీ బాగుంటుంది. కానీ తమ అభిప్రాయాలే నూటికి నూరుపాళ్లు కరెక్ట్..ఇతరులు తప్పు అనే ధోరణి ఇప్పుడు అంతటా పెరిగిపోతోంది. దీంతో స్నేహితుల మధ్య అభిప్రాయభేదాలు, సన్నిహితుల మధ్య దూరాలు పెరిగిపోతున్నాయి. ఏ ఇద్దరు కలిసినా కాస్త సమయం దొరికితే ప్రస్తుత రాజకీయాల కోసం చిన్నపాటి చర్చ జరుగుతోంది. అయితే ఆ చర్చ ఆరోగ్యకరంగా లేకుండా అపార్ధాలకు, అభిప్రాయభేదాలకు దారితీస్తోంది. స్నేహితుల మధ్య సన్నిహితుల మధ్య చిచ్చు పెడుతోంది.

మా నాయకుడు కరెక్ట్ అంటే మా నాయకుడు కరెక్ట్ అంటూ ఒక ప్రమాదకర వాదనకు తెరతీసుకుంటున్నారు. ప్రపంచంలో బాగా కుళ్లిపోయిన అవినీతిమయ రాజకీయ వ్యవస్థ ఏమన్నా ఉంది అంటే అది మన దేశ రాజకీయాలే. ఎన్నికల వ్యవస్థలోకి డబ్బును చొప్పించి అది తప్పు కాదనే భావనను ప్రజల మనస్సులోకి ఎక్కించగలిగారు కొందరు దగుల్బాజీ రాజకీయ నాయకులు. నాయకుడు 100 రూపాయలు తిన్నా ఫర్వాలేదు నాకు 10 రూపాయలు ఎవడు ఇస్తాడో వాడే దేవుడు అన్న ఆలోచనా ధోరణిలోకి ప్రజలను దిగజార్చారు. ఏతా వాతా చెప్పొచ్చిదేమిటంటే అందరు రాజకీయనాయకులు ఒకటే..ఈ రోజు మోదీని తిడుతున్న చంద్రబాబు రేపు మోదీతో కలిసిపోతే మీరెళ్లి ప్రశ్నించలేరు కదా? ఈ రోజు కొట్టుకు చస్తున్న చంద్రబాబు, జగన్ లు రేపు ఒకే కూటమికి మద్ధతు ఇవ్వచ్చు. రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు ఎప్పుడో మట్టికొట్టుకుపోయాయి. అవసరాలు, అధికారం మాత్రమే వాటికి ముఖ్యం. దానికోసం ఎంతకైనా దిగజారుతారు.

అయినా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మనకున్న ఆలోచనా పరిధిని బట్టి ఒక మంచి నాయకుడ్ని ఎన్నుకోవాల్సిందే. ఓటేయని వాడికి రాజకీయం కోసం, దేశం కోసం మాట్లాడే అర్హత లేదు. మీరు నమ్మిన వారికి ఓటేయండి. గెలిపించండి. అంతే కానీ మీ రాజకీయ చైతన్యాన్ని, భావాలను, అభిప్రాయాలపై మీ స్నేహితులతో వాదించకండి. మనతో జీవితాంతం ఉండేది మన స్నేహితుడే. మనకు కష్టమొస్తే పరిగెత్తుకు వచ్చేది మన స్నేహితుడు. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లు కాదు. మీ రాజకీయ అభిప్రాయాలను మీరు గౌరవించుకోండి. అలాగే మీ స్నేహితుడి రాజకీయ అభిప్రాయాలను గౌరవించండి. ఎప్పుడూ రాజకీయాల కోసం వాదించుకోకండి. ‘వాదన ఎప్పుడూ బంధాలను నాశనం చేస్తుంది.’

మిస్టర్ కే