హత్యలు చేసే ఆడవాళ్లకు ప్రబుద్ధులు కంటే పెద్ద పదం లేదా?

సాటి మనిషిని హత్య చేయడం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధనీయం కాదు. అత్యంత కిరాతకంగా మనుష్యులను హత్య చేసే వాళ్లు సమాజంలో జీవించేందుకు అర్హులు కాదు. ఈ విషయంలో రెండో వాదనకు తావన్నదే లేదు. అయితే మనుష్యులను హత్య చేసే వాళ్లపై కూడా సానుభూతి చూపించే సమాజాన్ని ఏమని పిలవాలి? దురదృష్టవశాత్తూ ఇప్పుడు మనం అటువంటి సమాజంలోనే బతుకుతున్నాం. రకరకాల వాదాల నడుమ కొట్టుకు పోతూ మానవతా వాదాన్ని మర్చిపోతున్నాం. అపరితమైన స్వేచ్ఛను అనుభవిస్తూ మన గొయ్యిను మనమే తవ్వుకుంటున్నాం. కేరళ, పశ్చిమ బెంగాల్లో ఆర్‌ఎస్ఎస్ కార్యకర్తలను దారుణంగా హత్యలు చేస్తే వామపక్ష వాదులు నోరు మెదపరు. మరో చోట వామపక్ష భావజాలం ఉన్నవారు హత్యకు గురైతే మాత్రం వాక్ స్వాతంత్రాన్ని హరిస్తున్నారు. అసహనం పెరిగిపోతోంది. మతతత్వం విజృంభిస్తోంది అంటూ గగ్గోలు పెడతారు. అందుకే ఇప్పుడు పౌర హక్కుల సంఘాల మాదిరిగానే వామపక్ష భావజాలం కూడా విమర్శలకు గురవుతోంది. హత్య అనేది ఎన్నటికీ సమర్ధనీయం కాదు అది రైట్ భావజాలమా…లెఫ్ట్ భావజాలమా..అన్నది కాదు ముఖ్యం మానవత్వం, సమానత్వం, స్వేచ్ఛ అన్నది ముఖ్యం. రకరకాల ముసుగులను కవచాలుగా ఏర్పరుచుకుని ఇప్పుడు కొందరు మన దేశంలో రెచ్చిపోతున్నారు. జర్నలిస్ట్ ల ముసుగు ధరించి తమ భావజాలాన్ని కాపాడుకునే వారు కొందరైతే, న్యాయవ్యవస్థ కల్పించిన చట్టాలను అడ్డం పెట్టుకుని పేట్రేగిపోతున్నవారు మరికొంత మంది.

ఇప్పుడు ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే..తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వీర వనిత ( మగాళ్లను హత్య చేసేవాళ్లను ఇలా కూడా పిలిచే స్త్రీ వాదులున్నారు) అత్యంత దారుణంగా తన భర్తను హత్య చేసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని జయలక్ష్మీ అనే మహిళామణి, తన భర్త భీమశంకరంకు విషాన్ని ఇంజెక్ట్ చేసి పని పూర్తి చేసింది. సదరు జయలక్ష్మీ ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో వీరేష్ అనే వ్యక్తితో ఇల్లీగల్ కాంటాక్ట్ ను మెయింటైన్ చేస్తోంది. విషయం బయటకు పొక్కడంతో గుడికి వెళ్దామని గౌరీ పట్నంలోని నిర్మలగిరికి భర్తను తీసుకెళ్లి అక్కడే అతనికి విషాన్ని ఇంజెక్ట్ చేసింది. తర్వాత ప్రియుడితో కలిసి చక్కా అక్కడి నుంచి వెళ్లిపోయింది. నిర్మలగిరి గుడి ప్రాంగణంలో గుర్తు తెలియని మృతదేహం అని కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెడితే ఈ విషయాలు వెలుగు చూసాయి.

అయితే ఇటువంటి న్యూస్ ను ప్రజంట్ చేయడంలో జర్నలిస్ట్ లు, వార్తా పత్రికలు, న్యూస్ ఛానెళ్లు అనుసరిస్తున్న వైఖరి ఆవేదన కలిగించేదిగా ఉంది. ఈ వార్తను ప్రజంట్ చేసిన ఈనాడు జర్నలిస్ట్ ఎలా రాసాడో చూడండి. ఒక మనిషిని కిరాతకంగా చంపిన దుర్మార్గురాలిని ప్రబుద్ధురాలు అని నిర్లక్ష్యంగా చేతులు దులుపుకున్నాడు. అదే ఒక మగవాడు ఒక మహిళను హత్య చేస్తే జర్నలిజంలో స్కూల్ తన నేర్పిన అన్ని పాఠాలను ఒకసారి గుర్తు చేసుకుని మృగాడు, కిరాతకుడు, రాక్షకుడు అంటూ తన జర్నలిస్ట్ స్కిల్స్ ను చూపించి ఉండేవాడు. మగవాడిని, ఆడవారిని సమాజం చూసే విధానం ఎంత వక్రమార్గంలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఒక మనిషి ప్రాణం తీస్తే ప్రబుధ్దురాలు అంటూ ముద్దుగా పిలవడం అన్నది ఒక్క మీడియాలోనే కాదు సమాజంలోనూ నాటుకుపోయింది. సమానత్వం అని గొంతు చించుకునే స్త్రీవాదులు ఇలాంటి హత్యలు జరిగినప్పుడు కూడా నోరెత్తుతారా? ఇటువంటి అమానవీయ చర్యలను ఖండించినప్పుడే సమానత్వం అన్న పదానికి అర్ధం ఉంటుంది. హత్య చేస్తే ఎవరైనా కిరాతకులే…వాళ్లు ఆడవాళ్లు అయినా మగవాళ్లు అయినా..ఇదే కుహనా సమానత్వం వల్లె వేస్తూ ఉంటే రానున్న రోజుల్లో మన దేశంలో మిగిలేది శిధిలమైన కుటుంబ వ్యవస్థ..కుదేలయ్యే మానవత్వాలు మాత్రమే.