కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్…మరీ ఇంత కాస్ట్‌లీనా??

 

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలప్పుడు మొదలైన వేడి ఇంకా చల్లారలేదు. తెలంగాణాలో కేసీఆర్ ను గద్దె దించాలని తమ పార్టీ ఆవిర్భావ ఉద్దేశాన్ని కూడా గంగలో కలిపేసి కాంగ్రెస్ తో దోస్తీ చేసి చంద్రబాబు బొక్కబోర్లా పడ్డారు. అతని అవకాశవాద రాజకీయ వ్యూహాలు బెడిసికొట్టాయి. కేసీఆర్ పై పూర్తిస్థాయి నమ్మకాన్ని ప్రదర్శించిన తెలంగాణా ప్రజలు చంద్రబాబు అండ్ కో ను తిరస్కరించారు. అయితే పక్క రాష్ట్రానికి సీఎం గా ఉంటూ ఇక్కడ తెలంగాణాలో ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బాబు చేసిన ప్రయత్నాలు సీఎం కేసీఆర్ కు ఆగ్రహాన్ని తెప్పించాయి. అందుకే ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానని పరోక్షంగా కేసీఆర్ చెప్పారు.

అయితే ఆ ప్రకటన ఏదో ఆషామాషీగా చేసింది కాదని తాజాగా రుజువవుతోంది. ఏపీలో చంద్రబాబుకు ఝలక్ ఇస్తూ చాలా మంది టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ చేస్తున్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో, నాయకుల ఆడగాలతో, అసందర్భ , అహంకార పూరిత మాటలతో టీడీపీపై ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నది కాదనలేని సత్యం. ఎన్నికల ముందు మీడియా అండతో ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఈ సారి ఏపీలో బాబు అధికారంలోకి రావడం అంత సులువైన విష‍యమేమీ కాదు. ఇటువంటి సమయంలో పలువురు టీడీపీ అగ్రనేతలు జగన్ పార్టీలోకి వెళ్లిపోయారు. అయితే ఈ పరిణామం సాధారణంగా జరిగింది కాదని ఈ వలసల వెనుక తెలంగాణా సీఎం కేసీఆర్ ఉన్నారని, ఆయన పరోక్షంగా జగన్ కు సహకరిస్తున్నారని టీడీపీ నాయకులు బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు.

అసలు విషయానికొస్తే తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇక్కడ పనులు చేసే కాంట్రాక్టర్లలో అధిక శాతం మంది ఆంధ్రా వాళ్లే ఉన్నారు. ఈ విషయంపై చాలాసార్లు కేసీఆర్ పై విమర్శలు కూడా వచ్చాయి. అది కాస్త పక్కన పెడితే బడా కాంట్రాక్టర్లు రాజకీయ నాయకుల బినామీలే అన్నది బహిరంగ రహస్యం. పలువురు ఏపీ టీడీపీ నాయకులు కూడా తెలంగాణాలో భారీ కాంట్రాక్టులు చేజిక్కించుకున్నారు. వాళ్లకు ఇష్టం ఉన్నా లేకపోయినా సీఎం కేసీఆర్ తో సత్సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుంది. తనకు ఇష్టం లేని వాళ్లను తనకు వ్యతిరేకంగా పనిచేసేవాళ్లను ఎలా శంకరగిరి మాన్యాలు పట్టించాలో కేసీఆర్ కు బాగా తెలుసు. ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్టు చేయడం మినహా వాళ్లకు మరేం దిక్కులేదు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే కేసీఆర్ కు ఉన్న అవకాశం జగన్ మాత్రమే. ఈ విషయం సదరు కాంట్రాక్టర్ కమ్ రాజకీయ నాయకులకు బాగానే తెలుసు. అందుకే కేసీఆర్ ఆదేశించకముందే జగన్ కండువాను కప్పుకుంటున్నారు.

మరోవైపు పచ్చ మీడియా చేతిలో ఉన్నా, ఎన్నికల ముందు ప్రజలను బుట్టలో వేసుకోవడానికి కోట్లాది రూపాయలు వెదజల్లుతున్నా చంద్రబాబుకు మాత్రం ఈ రిటర్న్ గిఫ్ట్ ఎఫెక్ట్ గట్టిగానే తగులుతోంది. విభిన్న వ్యూహాలతో ప్రజలను బోల్తా కొట్టించే బాబు గారు కేసీఆర్ పన్నిన ఈ రిటర్న్ గిఫ్ట్ వ్యూహాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగు దేశం కాంగ్రెస్ తో కలిస్తే తప్పు లేదు కానీ జగన్ కు కేసీఆర్ కు మద్ధతిస్తే అది మహాపరాధం అన్నట్టు కొందరు టీడీపీ నాయకులు, పచ్చ మీడియాలో బిల్డప్ లు ఇవ్వడం.

మిస్టర్ కే