స్త్రీ బుద్ధి ప్రళయాంతకం..ఈ స్టోరీ చదివితే అది నిజమేననిపిస్తుంది!!

అప్పట్లో స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అనేవారు..ఇప్పుడు అలా ఎవరైనా అంటే మహిళా సంఘాలు వచ్చి వాడ్ని ఆరడుగుల గోతిలో నిలువునా పాతిపెట్టేస్తాయి. ఇప్పుడు స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అనే మాట ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది ..అంత తీవ్రమైన పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే…కేరళలో ఒక కిలేడీ చేసిన దారుణం. దారుణం అనే కంటే మారణహోమం అనడం బాగుంటుందేమో..

14 ఏళ్లలో ఆరుగురు వ్యక్తుల్ని జాలీ అనే దుర్మార్గురాలు అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఈ అరుగురిలో ముక్కుపచ్చలారని రెండేళ్ల పసిపాప కూడా ఉందంటే ఈమె ఎంత కఠిన మనస్కురాలో అర్ధమవుతోంది. కేవలం ఆస్తి కోసం, తన నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం ఇంత మందిని..అదీ సొంత కుటుంబ సభ్యులను ఇంత అమానుషంగా చంపింది. సొంత భర్తను చంపడమే కాదు వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి భార్యను కూడా చంపి తన లైన్ ను క్లియర్ చేసుకుంది. ఒక వైపు ఆస్తి, మరోవైపు వివాహేతర సంబంధం కోసం ఏకంగా ఆరుగురిని విషం పెట్టి చంపింది.

అత్యంత పకడ్బందీగా ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఇంట్లో వ్యక్తులకు ఆహారం ద్వారా స్లో పాయిజన్ ఇస్తూ 14 ఏళ్లలో ఆరుగురిని చంపింది. అమెరికాలో ఉంటున్న ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి అనుమానం వ్యక్తం చేసి, పోలీసులకు కంప్లయింట్ చేయడంతో సదరు జాలీ గారి దుర్మార్గాలు, హత్యలు బయటపడ్డాయి. నేర ప్రవృత్తికి లింగ భేధం లేదంటూ ఎంత నెత్తి నోరూ బాదుకుంటున్నా వినని మన న్యాయ వ్యవస్థ ఇలాంటి ఘటనలతోనైనా కళ్లు తెరిస్తే బాగుణ్ను. తప్పుడు మనస్తత్వం, చెడు ఉద్దేశ్యం ఉన్నవారు అటు ఆడవారిలోనూ ఇటు మగవారిలోనూ ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మన సమాజం, న్యాయ వ్యవస్థ మాత్రం మగవాడినే దోషిగా చూస్తూ ఆడవారు అసలు నేరం చేయరు..తప్పులు చేయరు అన్న భావనలో ఉంటూ కొత్త కొత్త చట్టాలు చేస్తూ వాటిని అటువంటి చెడ్డ వారి చేతికి ఆయుధాలుగా అందిస్తున్నారు.

న్యాయ వ్యవస్థలోని ఈ లొసుగులను, మహిళకు రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలను ఉపయోగించుకుని ఇలాంటి క్రిమినల్ ఆడవాళ్లు పేట్రేగిపోతున్నారు. ఇప్పటికైనా నేర ప్రవృత్తికి లింగభేధం లేదని గ్రహించి ప్రభుత్వం చట్టాల్లో మార్పులు చేస్తే అమాయకులు బలి కాకుండా ఉంటారు.

Mr.K