లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఒక భావోద్వేగం..ఒక జీవిత పాఠం!!

నిజం చెప్పాలంటే నేను చాలా రోజుల ముందు ఒక నిర్ణయం తీసుకున్నాను. రామ్‌ గోపాల వర్మ, బ్లడ్ అండ్ బ్రీడ్ బాలయ్య సినిమాలు చూడకూడదని. అందరి తెలుగోళ్లలా సినిమా అంటే పిచ్చి ఉన్నా నా వ్యక్తిగత శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాను. విశ్వవిఖ‍్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ బయోపిక్ అంటే చూడాలనే ఆశ పుట్టనిది ఎవరికి? అయితే ఇక్కడ కూడా బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తీస్తా అని ప్రకటించగానే ఉన్న ఆశ కాస్తా ఆవిరైపోయింది. ఎన్టీఆర్ సినీ జీవితం పూలపాన్పు అని తెలియనిదెవరికి? అతనో సూపర్ స్టార్. వెండితెరకు కింగ్. అదే ఊపుతో రాజకీయాల్లోకి ప్రవేశించి సంచలనం రేపి అధికారాన్ని చేజిక్కించుకుని చివరికి అనుకోని రీతుల్లో మోసగించబడి అధికారాన్ని పోగొట్టుకుని ఒకరకమైన మానసిన వేధనతో తనువు చాలించారు. ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పుడు పుట్టిన నా లాంటి తరం వారు తెలుసుకోవాలనుకుంటున్నది ఆయన జీవితంలోని అత్యంత క్లిష్టతరమైన రోజుల్ని, సవాళ్లను, ఆయన వాటిని ఎలా ఫేస్ చేసారన్న విషయాల్ని. బాలయ్య తీసిన బయోపిక్ లు తన్నేయడానికి, రెండు రోజులు మించి ఆడకపోవడానికి ఎన్టీఆర్ జీవితంలో ఎత్తుపల్లాలను చూపించకపోవడమే.

అందుకే ఎన్టీఆర్ అన్న బ్రాండ్ ఉన్నా ఆ రెండు బయోపిక్ లు చూసే సాహసం నేను చేయలేదు. ఇక వర్మ ప్రకటించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పైన కూడా నాకు ఎటువంటి అంచనాలు, ఆశలు లేవు. ఎలానూ నేను వర్మ సినిమాలు చూడనని శపథం కూడా చేసాను కదా (వర్మకు టాలెంట్ ఉన్నా అతితెలివితో అడ్డగోలు కథలతో తన సినిమాలు అంటేనే ఏవగింపు కలిగేలా చేసుకున్నారు) ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై రాజకీయంగా రచ్చ జరుగుతున్నా, విడుదల విషయంలో కోర్టులో కలుగుజేసుకుంటున్నా నాకు అయితే ఎటువంటి ఆసక్తీ లేదు. ఎందుకంటే వర్మ చేతిలో ఎన్నో మార్నింగ్ షోల సాక్షిగా మోసపోయాను కాబట్టి. దీనికి తోడు వైసీపీ వాళ్లు ఈ సినిమాకు నిర్మాతలు కాబట్టి సినిమా రాజకీయంగానే ఉంటుంది. ఏదో వర్మ చాపచుట్టేసి ఉంటాడు. అన్న బలమైన ఫీలింగ్ కూడా ఉంది. అయితే సినిమా ఏపీలో తప్ప మిగతా అన్ని చోట్ల రిలీజ్ అయిన రోజు మధ్యహ్నం నా జర్నలిస్ట్ మిత్రుడు ఫోన్ చేసాడు. బ్రదర్..వీలుంటే ఒక్కసారి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ చూడు అని. పదేళ్ల మా సావాసంలో నా అభిరుచులు, నా ఇష్టాలు తెలిసిన మిత్రుడు సిఫార్సు చేయడంతో శపథం తీసి పక్కన పెట్టి ధైర్యం చేసి సినిమాకు వెళ్లాను. ఎటువంటి అంచనాలు లేకుండా బుర్రలో భావాలు, వాదనలు పెట్టుకోకుండా సినిమా ఆసాంతం చూసాను.

ఒక మహా వ్యక్తి జీవితంలో ఎత్తుపల్లాలను, భావోద్వేగాలను, బలహీనతలను, బలాలను, పట్టుదలను అందుబాటులో ఉన్న వనరులతో ఆర్‌జీవీ అద్భుతంగా తీసారు. సినిమాను సరైన రీతిలో చూసి అర్ధం చేసుకుంటే ఒంటరితనం ఎంతటి బలమైన మనిషిని కూడా ఎలా తన గుప్పిట్లోకి తెచ్చుకుంటుందో వర్మ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. తోడు లేని జీవితం అనేది మనిషిని బలహీనుడిగా చేస్తుంది అన్న విషయాన్ని కూడా బాగా చూపించగలిగారు. ముఖ్యంగా కష్ట సమయంలో పక్కనుండాల్సిన కుటుంబ సభ్యులు డబ్బు. పదవులు, పరువు అంటూ పెద్దాయన్ని ఏడిపించడం అద్భుతంగా ఎలివేట్ అయింది. ఒక స్త్రీ, పురుష సంబంధాన్ని కేవలం ఒకేరకమైన దృష్టి కోణంలో చూసే సంకుచిత మనస్తత్వాలు, అదును చూసి మోసం చేసే మోసకారి నక్కజిత్తులు ఈ సినిమాలో బాగా పండాయి. ముఖ్యంగా రామారావు పాత్ర చెప్పే డైలాగ్ లు కట్టిపడేస్తాయి. ‘ఒక మనిషిని అర్ధం చేసుకోలేని పరిపక్వత లేని మనుష్యులకు ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు లక్ష్మీ’…’మనమేంటో మనకు తెలిస్తే చాలు, అందరికి నిరూపించాల్సిన అవసరం లేదు’..వంటి డైలాగ్ కు మనస్సుకు హత్తుకుంటాయి.

పరిస్థితులు ప్రతికూలంగా మారినా ఒక స్త్రీ ఇచ్చిన భరోసా, నింపిన ధైర్యంతో మొండిగా పోరాటం చేయడం చూస్తే ఎన్టీఆర్ ఎందుకు అంత గొప్ప వ్యక్తి అయ్యాడో అర్ధమవుతుంది. వర్మ అన్నీ నిజాలు చూపించాడా అన్న ప్రశ్నలను పక్కన పెడితే సినిమా అనేది ఒక భావోద్వేగంతో ముడిపడిన విషయం. అందులో ఉన్న విషయంతో మనం కనెక్ట్ అయితే చాలు. ఆ విషయంలో వర్మ సక్సెస్ అయ్యాడు. నటీనటులతో మంచి నటనను రాబట్టుకోవడంతో పాటు ఏమోషన్ ను, డ్రామాను పండించడంలో తన అనుభవాన్ని ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ గా లక్ష్మీ పార్వతిగా, చంద్రబాబు పాత్రలో నటించిన నటులు తమ ఎంపికకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేసారు. సినిమాను కుటుంట కలహాలు, రాజకీయ కుట్రల కోణంలో కాకుండా ఒక మనిషి జీవితంలో జరిగిన పరిస్థితులను భావోద్వేగంతో చూస్తే బాగా నచ్చుతుంది.

ఎన్నో విజయాలతో తిరుగులేని మనిషిగా ప్రజలతో దేవుడిగా కొలువబడ్డ వ్యక్తి జీవితం ఎలా ముగిసిందో చూస్తే కళ్లు చెమరుస్తాయి. రాజకీయాల్లోకి రాకున్నా ఉండి ఉంటే ఎన్టీఆర్ మరిన్ని రోజులు బతికేవారు అన్న ఆలోచన కూడా వస్తుంది. కానీ అడుగు ముందుకు వేసాక వెనుదిరిగి చూసే ప్రసక్తే లేకుండా కష్టాలను ఎదుర్కోని ఒంటరితనం, అనారోగ్యం బాధపెడుతున్నా పోరాటం చేయడం ఎన్టీఆర్ నుంచి యువతరం నేర్చుకోవాల్సిన విషయం. మన కష్టాల్లో మనతో ఉన్నవాళ్లే నిజమైన ఆప్తులు. మిగిలిన వాళ్లంతా చనిపోయాక దండలు వేసి వాటిని కూడా ప్రచారం కోసం వాడుకునే అల్ప మనస్కులు.

మిస్టర్ కే