‘సైరా నరసింహారెడ్డి’ మిస్టర్ కే రివ్యూ

చరిత్ర మర్చిపోయిన ఒక వీరుని కథ…..
అందునా స్వాతంత్రం కోసం తొలిసారిగా పోరాడిన ఒక యోధుడు, మన తెలుగువాడు…
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన దగ్గర్నుంచి నన్ను ఆకర్షించిన విషయాలు ఇవే…

అయితే ఎప్పుడూ చారిత్రాత్మక సినిమాలు చేయని మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెప్పించగలడా అన్నది నాలో ఎక్కడో ఓ మూల చిన్న సందేహం. అయితే నా సందేహం ఎంత పనికిమాలిన విషయమో, ఎంతటి అజ్ఞానమో సినిమా ప్రారంభమైన అరగంటకే నాకు అర్ధమైంది. చిరంజీవి మెగాస్టార్ ఎందుకయ్యాడో అతన్నిఅభిమానులు ఎందుకు అంతలా ఆరాధిస్తారో మరోసారి నాకు తెలిసింది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఆఖరికి నన్ను మెగాస్టార్ అభిమాని అన్నా ( చిరంజీవి అభిమాని అవడం వాస్తవానికి గర్వకారణం) నాకు లెక్క లేదు. ఈ సినిమా చిరంజీవి మాత్రమే చేయగలిగిన, చేయదగ్గ సినిమా. ఈ సినిమాలో చిరంజీవి నట విశ్వరూపంతో పాటు అతని ధైర్యం నాకు ఆశ్యర్యాన్ని కలిగించాయి. అసలు చిరంజీవి అంటేనే డ్యాన్సులు అలాంటి చిరంజీవి ఒక డ్యూయెట్ లేకుండా డ్యాన్స్ వేయకుండా సినిమా చేయాలంటే ఎన్ని గట్స్ ఉండాలి. నాకు తెలిసి చిరంజీవి సినిమాల్లో డ్యాన్స్‌లు లేని సినిమా అంటే ‘సైరా నరసింహారెడ్డి’.

ఒపెనింగ్ షాట్ నుంచే సినిమాలో ప్రేక్షకుడ్ని లీనం చెయ్యడంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి విజయం సాధించాడు. మనల్ని కథలోకి తీసుకెళ్లేందుకు అతను వాడుకున్న ఎత్తుగడ నాకు బాగా నచ్చింది. మధ్యలో కాస్త నెమ్మదించినట్టు అనిపించినా అది ప్రేక్షకుడు గమనించేలోగానే అద్భుతమైన ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లారు. ఇక ఇంటర్వెల్ తర్వాత సినిమా కోసం ఎంత చెప్పినా తక్కువే. ప్రేక్షకుడు సీటులో అసహనంతో కదిలితే ఆ సినిమా తేలిపోయినట్టే. సైరా లో ఇంటర్వెల్ తర్వాత సీటులో బిగదీసుకు కూర్చోవడమే తప్ప అసహనంతో కదిలే వారు ఎవరూ కనిపించరు. ఇక క్లైమాక్స్ అయితే అత్యద్భుతం. అందరికీ తెలిసిన క్లైమాక్స్ అయినా చిరంజీవి నటన, చివర్లో దర్శకత్వ ప్రతిభ వెరసి సీట్లో కూర్చున్న ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. తనకు తెలియకుండానే అతను సినిమాలో లీనం అయిపోతాడు. అంత అద్భుతంగా ఉంది క్లైమాక్స్.

ఈ జనరేషన్ లో చాలా మందికి హీరో అంటే చిరంజీవే. చాలా మంది అతని సినిమాలు చూస్తూ పెరిగి ఉంటారు. అలాంటి వారు కూడా అతని నట విశ్వరూపానికి ఆశ్చర్యపోయి నోరు వెళ్లబెట్టి చూడాల్సిందే. ముఖ్యంగా రౌద్రం, సెంటిమెంట్ సీన్స్ లో చిరంజీవి ఫెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. 64 ఏళ్ల వయస్సులో అతని ఎనర్జీ లెవెల్స్ , మెరుపులా కదిలే వేగానికి శిరస్సు వంచి నమస్కరించాల్సిందే. పట్టుదల, కృషి, పని పట్ల గౌరవం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ముఖ‌్యంగా నలభై ఏళ్లకే డ్యాన్స్ లు వేయడం మానేసి చేతులు ఊపుతూ హీరోయిన్ పక్కన అలా అలా నడిచేస్తూ బండి లాగిస్తున్న స్టార్ హీరోలు చిరంజీవిని చూసి కాస్త మారొచ్చు.

సినిమా అంతా అద్భుతమేనా ? లోపాలు లేవా ? అంటే ఎంత అద్భుతమైన సినిమాలో అయినా చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఉన్నాయి. విజయ్‌ సేతుపతి వంటి మంచి నటుడ్ని సరిగ్గా వాడుకోలేదు. కొన్ని సీన్లు సాగదీసినట్టు ఉన్నాయి. అయితేనేం సినిమా మొత్తం సర్వాంతర్యామిగా కనిపించిన చిరంజీవి వాటినన్నింటిని తన నటనతో పూడ్చిపెట్టేసాడు.

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చరిత్ర మర్చిపోయిన ఒక తెలుగు వీరుని కథను మాత్రమే మనకు చూపించలేదు. మన మధ్యే ఉన్న చిరంజీవి అనే ఒక అద్భుత స్ఫూర్తి ప్రధాతను మనకు మరోసారి ఘనంగా పరిచయం చేసింది.

Mr.K