వాడేసుకుంటారు..జాగ్రత్త!

జీవితం అంటే ఒక ఆట. ఆట అంటే మామూలు సాదాసీదా ఆట కాదు. కింద పడేసి, తొక్కేసి క్రూరంగా విజిల్ వేస్తూ మనకు పరిగెత్తడం ఎలాగో నేర్పించే ఛండశాసన కోచ్ జీవితం. ఒక ప్రముఖ రచయిత చెప్పినట్టు ఈ మనుష్య ప్రపంచం కూడా అడవి లాంటిదే. పరుగెత్తడం రాకున్నా. నిన్ను నువ్వు కాపాడుకోవడం రాకున్నా క్రూర మృగాలకు నిర్దాక్షిణ్యంగా ఆహారం కావాల్సిందే. అడవిలో ఉన్న జంతువులు ఎలా అయితే ఆత్మ రక్షణ కోసం, మనుగడ కోసం నిరంతరం పోరాటం చేస్తాయో మనం కూడా ఈ ఆధునిక ప్రపంచంలో అలుపెరుగని పోరాటం చేయాల్సిందే. లేకుంటే స్వార్థపరులు అనే తోడేళ్లకు ఆహారంగా మారిపోతాం. జీవితాన్ని గెలవడానికి ఎంత కష్టపడుతున్నా మనల్ని ఎలా కిందకు లాగాలి. వారికి స్వార్ధానికి ఎలా వాడుకోవాలి అని ఎదురుచూసే గుంట నక్కలు అనుక్షణం పొంచి ఉంటాయి.

 

ఈ పోటీ ప్రపంచంలో మంచితనం ఉంటే సరిపోదు, సహనశీలత ఉండే సరిపోదు. వాస్తవానికి ఈ రెండు లక్షణాలు కూడా మీ ఎదుగులకు చాలాసార్లు ప్రధాన ఆటంకంగా మారుతూ ఉంటాయి. అవసరమైనప్పుడు కఠినంగా ఉండాలి. కోపాన్నీ ప్రదర్శించగలగాలి. లేకుంటే మన మంచితనాన్ని, సహాయం చేసే గుణాన్ని వాడేసుకునేందుకు చాలా మంది రెడీగా ఉంటారు. వారి స్వార్థం కోసం మనల్ని ఎలా ఉపయోగించుకోవాలి, మనతో ఏయే పనులు చేయించుకోవాలి. అవసరం లేనప్పుడు ఎలా వదిలించుకోవాలి అని ఆలోచించే వాళ్లకు ఈ రోజుల్లో కొదువలేదు. అన్ని చోట్లా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్లని వీలైనంత త్వరగా గుర్తించగలడమే మనం జీవితంలో పరిణితి సాధిస్తున్నాం అనడానికి సంకేతం.

 

 

సహాయం చేయాలి అనుకోవడం, ఎదుటి వ్యక్తికి తన అవసరం అయినప్పుడు తప్పకుండా అందుబాటులో ఉండాలి అనుకోవడం మంచి విషయం. కానీ ఇక్కడే కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం నేర్చుకోవాలి. సమస్యకు స్పందించే గుణం, సమస్య పట్ల సున్నితంగా ఉంటడం ఒక మనిషి వ్యక్తిత్వ వికాసంలో చాలా ముఖ్యమైన విషయాలు. అదే సమయంలో నో చెప్పగలగడం, ఎదుటి వ్యక్తి తనతో ఎలా వ్యవహరిస్తున్నాడన్న విషయాన్ని బేరీజు వేసుకోవడం తప్పనిసరిగా నేర్చుకోవాలి. చాలా మంది ఎవరైనా సహాయం అడిగినప్పుడు మొహమాటపడుతూ నో చెప్పేందుకు జంకుతూ ఉంటారు. ఇది మీ వ్యక్తిగత అభివృద్ధికి ప్రథాన అవరోధంగా మారుతుంది. అవసరం అనుకున్నప్పుడు నో చెప్పడం తెలియాలి. లేదంటే అవతలి వ్యక్తి మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మీకు పనులు చెపుతూనే ఉంటాడు. ఎప్పుడూ విజయవంతంగా అతని పనిని పూర్తి చేసే మీరు ఒకసారి అందులో ఫెయిల్ అయితే మిమ్మల్ని తప్పుపడతాడు కూడా. ఇలాంటి సహాయాలు మీ గౌరవాన్ని, మీ వ్యక్తిత్వాన్ని కిందకు దిగజారుస్తాయి.

 

 

అలా అని సహాయం కావాల్సిన వారికి సహాయం చేయొద్దా అంటే…చేయాలి. అవసరం ఉన్నవారికి కచ్చితంగా సహాయం చేయడమే మనిషిగా మన ప్రథమ కర్తవ్యం. కానీ తను చేసుకోదగిన పనిని కూడా ప్రతీసారి మీకు అప్పగించడం, మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని వాడుకుంటున్నప్పుడు అటువంటి వ్యక్తులకు దూరంగా జరగండి. అలాగే ప్రస్తుతం చాలా మంది మానవ సంబంధాల్లో కూడా వ్యాపార సూత్రాలను అప్లయ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎలా వాడేసుకోవాలి. మీ నుంచి ఎటువంటి ప్రయోజనాలు పొందాలి అన్నదే వాళ్ల ప్రధాన అజెండా. ఇలాంటి వాళ్లను గుర్తించడం చాలా కష్టం. కాస్త నిశితంగా పరిశీలిస్తే వీళ్లను గుర్తించడం అంత కష్టమేమీ కాదు. మీ నుంచి నిరంతం సహాయం పొందుతూ , మీ సమస్యలు వినేందుకు, మీకు సహాయం చేసేందుకు ముందుకు రాని వ్యక్తులను తొందరగా వదిలించుకోండి. వాళ్లతో మీకు ఎటువంటి ఉపయోగం లేదు. వ్యాపారమైనా, వ్యక్తిగత జీవితమైన పరస్పర ప్రయోజనాలను గౌరవించే వ్యక్తులతోనే ప్రయాణం చేయండి. మిమ్మల్ని ఎలా వాడేసుకుందామా? మీ నుంచి ఏం సహాయం పొందుదామా? అని ఆలోచించే వారితోనూ ..మీ నుంచి సహాయం పొంది కూడా అవసరమైనప్పుడు మీకు అందుబాటులో లేకుండా స్పందించని వ్యక్తుల గురించి అసలు పట్టించుకోకండి.

 

మిస్టర్ కే