RGV యే పవన్ కు పెద్ద ఫ్యాన్..’పవర్‌ స్టార్’ రివ్యూ

ఆ మధ్య వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. వీడి చర్యలు ఊహాతీతం వర్మా అని. దర్శకుడు రామ్‌గోపాల వర్మ తీసిన తాజా సినిమా ( దీన్ని సినిమా అనాలో లేక షార్ట్ ఫిల్మ్ అనాలో అర్ధం కాదు) పవర్ స్టార్. తన క్రియేటివిటీని వివాదాలకు వాడుకుంటూ ఇండియాలో టాప్ డైరెక్టర్ ప్లేస్ నుంచి కృష్ణానగర్ చిల్లర బ్యాచ్ స్టేజ్ కి వచ్చేసిన వర్మ ఈ సినిమాకు కూడా వివాదాలతో హైప్ క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హార్డ్‌‌కోర్ ఫ్యాన్స్ గా పేరు పొందిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కెలకడం ద్వారా అందరి చూపును తనవైపు తిప్పుకోవచ్చన్న పరమ చవకబారు ఎత్తుగడ ( కత్తి మహేష్, శ్రీరెడ్డితో ఆల్రెడీ సక్సెక్‌ఫుల్ గేమ్ ఆడేసాడు) మరోసారి అప్లయి చేసాడు. కరోనా టైం లో ఒకవైపు ప్రాణాలు పోతుంటే ప్రభుత్వాలను చురుగ్గా ఉంచాల్సిన మీడియా ఈ ఎత్తుగడలో పడిపోయి రామ్‌గోపాల వర్మ, పవన్ ఫ్యాన్స్ చిల్లర గొడవలను హైలెట్ చేసాయి. తెలుగు ఛానెళ్లు గత వారం రోజులుగా సెన్సేషన్ బురదలో మునిగి తేలి ప్రజా సమస్యల కంటే తమకు టీఆర్‌పీలే ముఖ్యమనుకుంటూ జర్నలిజం ముసుగులో వ్యాపారం చేసుకున్నాయి.

ఇక రివ్యూలోకి వెళ్లే …అసలు రివ్యూలోకి వెళ్లేందుకు ఈ సినిమాలో ఏముందని. ఒక ఇంటిలో, ఒక తోటలో ఇద్దరు ముగ్గురు డూప్ లను పెట్టి ఐ ఫోన్ తో లాగించిన సినిమా ఇది. ( ఈ సినిమా కంటే యూట్యూబ్ లో ఉన్న కొన్ని షార్ట్‌ ఫిల్మ్ లు ఎంతో నాణ్యతతో ఉంటాయి.) ఎలక్షన్స్ లో ఓడిపోయి పూర్తిగా నిరాశలో కూరుకుపోయి ఉంటాడు ప్రవన్‌ కళ్యాణ్. ( హీరో పేరు ఇదే). తన ఫాం హౌస్ లో గెదేలకు గడ్డి మేపుకుంటూ ఉంటే తన దర్శక స్నేహితుడు వచ్చి ‘మళ్లీ సినిమాలు చేయాలి’ అని సలహా ఇస్తాడు. మరోవైపు తన పెద్ద అన్న వచ్చి ‘మనకెందుకురా రాజకీయాలు. ఇప్పటికీ నన్ను తిడుతున్నారు.’ అంటాడు. చిన్న అన్న ఫోన్ చేసి ‘ఫలానా వాడు ఏదో వాగుతున్నాడు వాడి అంతు చూడాలి మనం’ అంటాడు. మరోవైపు రష్యన్ లాంగ్వేజ్ లో ఏదేదో మాట్లాడుతున్న భార్య, మూడు పెళ్లిళ్లు కోసం ఇంటర్వ్యూ చేసే కత్తి మహేష్. ఇలా 30 నిమిషాల పాటు ఈ రొడ్డ గొట్టుడు కథనంతో నడిపించాడు దర్శకుడు.

వీళ్ల మాటలతో ఒకరకమైన కన్ఫ్యూజన్ తో రాజకీయాలు వదిలేద్దామా అని హీరో ప్రవన్ కళ్యాణ్ కుర్చీలో కూర్చుని ధీర్ఘంగా ఆలోచిస్తున్న వేళ రామ్‌గోపాల వర్మ వోడ్కా బాటిల్ తో శ్రీకృష్ణ పరమాత్మలా వస్తాడు. మీ పక్కనున్న వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచారని, మీ అంత నీతివంతమైన రాజకీయనాయకుడు లేడు అని మీ ఆలోచనా విధానం చాలా అద్భుతంగా ఉందని పొగడ్తలు కురిపిస్తాడు. పైగా పొరపాటును హీరో కాలు తనకి తగిలితే మీరు పవర్ స్టార్, మీరు నాకు సారీ చెప్పనవసరం లేదంటూ ఏదో అర్ధం పర్ధం లేని లాజిక్ లు మాట్లాడుతూ ఉంటాడు. చివరి 10 నిమిషాలు కేవలం ప్రవన్ ను కుర్చీలో కూర్చోబెట్టి పార్ధాయ చేసినట్టే ఉంది. మొత్తానికి ఈ సినిమా ( సారీ దీన్ని సినిమా అనలేం) చూసిన వారికి ఇంతకీ వర్మ, పవన్ ను తిట్టాడా పొగిడాడా అర్ధం కాక జుత్తు పీక్కుంటారు. ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఈ లాక్‌డౌన్ టైం లో నాలుగు రాళ్లు వెనుకేసుకుందామన్న వర్మ తాపత్రయం మాత్రమే నాకు ఇందులో కనిపించింది. ఎందుకంటే సెటైరికల్ మూవీ తీసినా ఎక్కడా పవన్ ను తిట్టే ధైర్యం లేక మరోవైపు నిర్మాణాత్మక విమర్శ చేయలేక వర్మ నలిగి పోయాడు. చివరికి ఏం చేయాలో తెలియక ఒక సాధారణ పవన్ భక్తుడిలా మారిపోయి మీ అంత వీరుడు శూరుడు లేదంటూ పొగడ్తలు కురిపించి, ఏదో నర్మగర్భంగా మాట్లాడా అని సంతృప్తి చెందుతూ ,భయపడుతూ ఈ చిత్ర రాజాన్ని, చేతిలోని వోడ్కా బాటిల్ ను ఫినిష్ చేసాడు. ఇంతకంటే ఈ సినిమా కోసం చెప్పుకునేందుకు ఏం లేదు. ( ఈ 40 నిమిషాల కళాఖండాన్ని చూసేందుకు వర్మకు 140 రూపాయలు సమర్పించుకున్న వెర్రివాళ్లకు సానుభూతితో ..)

Mr.K