సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూరగాయలు అమ్ముతోంది…అయితే..!

ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో శారద అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లాక్‌డౌన్ ఎఫెక్ట్ తో ఉద్యోగాన్ని పొగొట్టుకుని కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతోంది. కచ్చితంగా ఇది హృదయాన్ని కదిలించే ఇంట్రెస్టింగ్ స్టోరీయే. ఇందులో సందేహం లేదు.. శారద అనే ఆడకూతురు ఈ విధంగా కూరగాయలు అమ్మడం కుటుంబాన్ని పోషించడం అన్నది నిజంగా స్పూర్తిదాయకమే. కానీ ఇప్పుడు మనుష్యుల జీవితం కరోనాకు ముందు కరోనాకు తర్వాత అన్నట్టు తయారైంది. ఇప్పుడు ఒక్క శారదాయే కాదు దేశంలో కొన్ని లక్షల మంది ఉద్యోగులు కుటుంబ పోషణ కోసం వారి అర్హతలకు, నైపుణ్యానికి అసలు సరితూగక పోయినా అందుబాటులో ఉండే కొన్ని ఉపాధి మార్గాలను ఎన్నుకుంటున్నారు. ప్రిన్సిపల్ గా దర్జాగా బతికిన మనిషి రోడ్డు పక్కన దోశెలు వేసుకుంటుంటే, బాలీవుడ్ సినిమాల్లో నటించిన నటులు కూడా కూరగాయలు, కిరాణా దుకాణాలు నడుపుతూ పొట్టపోసుకుంటున్నారు. కరోనా మహమ్మారి రాత్రికి రాత్రే ఎన్నో కోట్ల జీవితాలను తలకిందులు చేసేసింది.

మనుష్యుల హిపోక్రసీని, వాస్తవానికి దూరంగా జరిగే మనస్తత్వాన్ని ఎరిగిన మీడియా మాత్రం కూరగాయలు అమ్ముతున్న శారదతో ఏకంగా చర్చా కార్యక్రమమే పెట్టింది. ఇక్కడ శారద ఎంచుకున్న మార్గాన్ని, చూపిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని తక్కువ చేసి చూడటం కాదు. ఇప్పుడు అందరిదీ అదే పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులు, మంచి కంపెనీల్లో పనిచేస్తున్న వారు తప్పిస్తే అందరూ ఏదో ఒక విధంగా కరోనాతో తిప్పలు పడుతున్నారు. షాపింగ్ మాల్స్ లో, మల్టీఫ్లెక్స్ లలో, పెద్ద పెద్ద షోరూమ్ లలో పనిచేసిన వారంతా ఏమైపోయారు? ఎలా ఉపాధి పొందుతున్నారు? అన్నదానిపై ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. ఏ మీడియా చూపించదు. కానీ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూరగాయలు అమ్ముతోంది అనగానే అది పెద్ద వార్త అయిపోయి వైరల్ గా మారుతోంది. ఇది ఎలా ఉంది అంటే సెలబ్రీటీలకు కరోనా రాగానే మీరు త్వరగా కోలుకోవాలి సార్ అని మెసెజ్ లు పెట్టే పెద్ద మనుష్యులు తమ పక్కింటి వాడికి కరోనా రాగానే వాడ్ని పురుగును చూసినట్టు చూస్తున్నారు. ఇవి ఏ రకమైన మనస్తత్వాలు. కోటి ఆశలతో బీటెక్‌లు , ఎమ్‌టెక్ లు చదివి. అడ్డమైన కోర్సులన్నీ నేర్చుకుని కరోనా దెబ్బకు ఇప్పుడు చెరువుల్లో మట్టి పూడికలు తీస్తున్నారు. ఎందుకు? కేవలం ఏదో ఒక పని చేసి పొట్ట నింపుకోవాలన్న అత్యవసరం అంతే. దీనికి ప్రత్యేకంగా ఎవరి నుంచో స్పూర్తి పొందాల్సిన అవసరం లేదు ఆకలి ఉంటే చాలు.

ఈ పరిస్థితికి ఎవర్నీ తప్పు పట్టేందుకు లేదు. ఎవరూ ఊహించని ఒక మహా ఉపద్రవం వచ్చి పడింది. జీవితం విలువ తెలిసొచ్చింది. ఇప్పుడు బతకడమే ముఖ్యం. కష్టపడి ఎలా అయినా పని చేసి కుటుంబాన్ని పోషించాలి. అదీ అందుబాటులో ఉన్న వనరులతో. ఇది అందరూ చేస్తున్నారు. అందరూ ఇప్పుడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ను ఓన్ చేసుకుంటున్నారు. ( ఓన్ చేసుకోవాల్సి వచ్చింది) శారద డిగ్నిటీ ఆఫ్ లేబర్ కు నిలువెత్తు రూపమని ఇంకెవరూ ఆ రేంజ్ లో లేరంటూ కామెంట్స్ , లైక్ లు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ కు కచ్చితమైన వివరణ ఏంటి? ప్రిన్సిపల్ ఎందుకు దొశెలు వేసుకుంటున్నాడు. ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు కాకరకాయ లేదు . కేవలం బతుకు బండిని నడిపించాలన్న తాపత్రయం. అవకాశం ఉండి ఎటువంటి సిగ్గు లేకుండా ఏ పనైనా చేయగలిగితే దాన్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. ఒక పెద్ద కంపెనీ సీఈఓ ఉన్నాడు. కారణాలు ఏమైతేనేం అతను తన ఉద్యోగం పొగొట్టుకున్నాడు. ఇప్పుడు తన ఊరు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. దాన్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటూ అతను మహా మనిషి అంటూ మీడియా హైలెట్ చేస్తే అర్ధం ఉందా? అవకాశం లేదు కాబట్టి అతను ఆ పని చేస్తున్నాడు. రేప్పొద్దున్న పరిస్థితులు చక్కబడి ఇంకో కంపెనీలో అవకాశం వస్తే వ్యవసాయాన్ని ఎడం కాలితో తన్ని అక్కడికి వెళ్లిపోతాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అత్యున్నత స్థితిలో ఉండి కూడా ఏ పనైనా చేసేందుకు వెనుకాడకపోవడం. అధ:పాతాళానికి పడిపోయాక ఏ పనైనా చేయడాన్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనరు. బతుకు తెరువు అంటారు.

కరోనా దెబ్బకు అన్ని రంగాలు, అన్ని స్థాయిల వ్యక్తులు కుదేలైపోయారు. దానికి ఎవరూ అతీతులు కారు. అందరూ జీవన పోరాటం చేస్తున్నారు. అందులో ఎవరూ ప్రత్యేకమైన వారు కాదు. ఎవరి స్థాయిలో వాళ్లు కష్టపడుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరో, సినిమా యాక్టరో కూరగాయలు అమ్మితేనో స్పూర్తి పొందే స్థితిలో ఎవరూ లేరు. ఆకలి అన్నీ నేర్పిస్తుంది. దానికి స్పూర్తి కథనాలు, ప్రత్యేక చర్చా కార్యక్రమాలు అవసరం లేదు.  అవసరం అన్నీ చేయిస్తుంది. ఎంత కష్టమైనా పడేలా చేస్తుంది. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ అయ్యిండి శారద కూరగాయలు అమ్ముతోంది. ఛ..నేనెందుకు ఇంట్లో పడుకున్నా..అనుకుంటూ ఒకటే మరణం ఒకటే జననం అని సాంగ్ పెట్టుకుని రెడీమెడ్ ఇన్‌స్పిరేషన్ పొందాల్సిన అవసరం లేదు. కరోనా ఎన్నో నేర్పించింది. అలాగే కృత్రిమ స్పూర్తిని దూరంగా తరిమి పురాతన మనిషిని వెలికి తీసింది. ఇప్పుడు పరిగెడితేనే ఆకలి తీరుతుంది. పరిస్థితులు చక్కబడే వరకూ ఎలా అయినా బతకాలి..ఏమైనా చేయాలి..అంతే.

 

Mr.K

 

 

Related Story Links: 

పీహెచ్‌డీ చేసిన ఈమె కూరగాయలు ఎందుకు అమ్ముతోంది?

 

 

కూరగాయలు అమ్ముకుంటున్న బాలీవుడ్‌ నటుడు!