ఎవరీ లెనిన్? మన దేశంలో ఈయనకు విగ్రహాలేంటి?

 

“సిద్ధాంతాల పేరిట మనుషుల్ని హతమార్చడం ఏ దేశంలో జరిగినా, ఎవరు చేసినా ఒకటే. ఒక సిద్ధాంతం పేరిట చంపితే అది మానవ కళ్యాణానికి దారితీస్తుందనీ, మరో సిద్ధాంతం పేరిట మనుష్యులను హతమారిస్తే దారుణమనీ భాష్యం చెప్పడం అన్నది కేవలం దురుద్దేశ్యంతోనే.”  నిష్పాక్షికంగా చూస్తే నరహంతకుల జాబితాలో ఈ శతాబ్దంలో ప్రథమస్థానం, అగ్రతాంబూలం లెనిన్ కు ఇవ్వాల్సిందే. లెనిన్ అసలు పేరు బ్లాడిమిర్ ఇల్లిక్ ఉలియనోవ్. 1870లో రష్యాలోని ఓల్గా నదీతీరాన గల సింబ్రిస్క్ లో లెనిన్ పుట్టాడు. తండ్రి ప్రాథమిక పాఠశాలలో తనిఖీ అధికారి. లెనిన్ అన్నను జార్ ప్రభుత్వం ఉరితీసింది. ఒక నాటుబాంబుతో జారు చక్రవర్తిని చంపాలనే ప్రయత్నం చేయడంతో యీ శిక్షపడింది. అప్పటి నుంచి లెనిన్ లో తీవ్రవాద భావాలు పురుడు పోసుకున్నాయి.

 

జార్ ప్రభుత్వం స్థానే తాత్కాలికంగా ఏర్పడిన కెరన్ స్కి ప్రభుత్వం పరిస్థితిని అదుపులో పెట్టలేక సతమత మౌతున్నప్పుడు లెనిన్ తన బోల్షివిక్ అనుచరులతో చారిత్రక పాత్ర నిర్వహించి అధికారానికి రాగలిగాడు.1917జూన్ లో అఖిల రష్యా సోవియట్ కాంగ్రేస్ సమావేశాలు జరిగాయి. అందులో బోల్షివిక్‌ల సంఖ్య 105 మాత్రమే. మొత్తం ప్రతినిధులు 822, యుద్ధానికి వ్యతిరేకంగా చేసిన ప్రదర్శన కారణంగా లెనిన్ ఫిన్లండ్ పారిపోవలసి వచ్చింది. 1917 సెప్టెంబరు నాటికి మాస్కో, పెట్రోగ్రాడ్ సోవియట్లలో అధిక సంఖ్యాకులు బోల్షివిక్ లు. ఈ సోవియట్లకు అధికారం హస్తగతం కావాలనేదే లెనిన్ నినాదం. అక్టోబరులో రహస్యంగా లెనిన్ పెట్రోగ్రాడ్ చేరి, మొట్ట మొదటిసారిగా పోలిట్ బ్యూరో స్థాపించాడు. అక్టోబరు 25న సోవియట్ల సమావేశం జరిగింది. మరునాడు పెట్రోగ్రాడ్ లో కీలక స్థావరాలన్నీ బోల్షివిక్కులు ఆక్రమించారు. తరువాత రాజ్యాంగసభ నిమిత్తం ఎన్నికలు జరిగాయి. మొత్తం 707 స్థానాలలో బోల్షివిక్కులకు 175 వచ్చాయి. ఆ విధంగా బోల్షివిక్కులు ఏనాడూ అధిక సంఖ్యలో లేరు.

 

అధికారాన్ని హస్తగతం చేసుకున్న రెండు రోజులకే, లెనిన్ పత్రికా స్వేచ్ఛను అరికట్టాడు. లెనిన్ అధికారాన్ని పట్టుకున్న తరువాత ఒక రహస్య సైనిక సంస్ధను స్థాపించాడు. ఆల్ రష్యన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ కమిషన్ ను పొడిగా చేకా అంటారు. ఈ రహస్య సంస్థ లెనిన్ వున్నంతకాలం బయటవారికి తెలియలేదు. 1917 డిసెంబరులో మొదలు బెట్టి యీ చేకా సంస్థ విపరీతంగా పెరిగి ప్రాకిపోయింది. స్థానిక సోవియట్లు సమాచారం అందిస్తుండగా, మూడేళ్ళలో చేకా రహస్యసంస్థ 2,50,000 మందిని చేర్చుకున్నది నెలకు సగటున వెయ్యిమందిని రష్యాలో లెనిన్ నాయకత్వాన, విప్లవ వ్యతిరేకుల పేరిట ఉరితీసినఖ్యాతి ఈ రహస్య సంస్థకు దక్కింది.

 

చేకా అనే రహస్య సంస్థ విచారణకూడా రహస్యంగానే జరిపేది. చేకా సంస్థతో బాటు రష్యా అంతటా రహస్య నిర్బంధ శిబిరాలు, జైళ్ళు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోగ్రాడ్ నుండి మాస్కోకు రాజధానిని మార్చిన లెనిన్ తక్షణమే క్రెమ్లిస్ లో ఒక రహస్య కేంద్రాన్ని, దీనికి తెలియకుండా జర్జినిస్కే నాయకత్వాన మరో రహస్య స్థావరాన్ని ఏర్పరచాడు. ఇదే చేకా అంటే. ఈ సంస్థ లెనిన్ కు మాత్రమే జవాబుదారి. దీని ఉనికి ఎవరికీ తెలియదు. తొలుత ఒక జీవితభీమా భవనంలో చేకా స్థావరాన్ని ఏర్పరచారు. ఊరికే తిరిగేవారిని వున్న పళంగా చంపేయమని లెనిన్ చేకాకు ఉత్తరువులిచ్చాడు. అనేక విధాలైన శత్రువులను సంహరించమని 1918 ఫిబ్రవరి 23న లెనిన్ మరో ఆదేశం చేకాకు యిచ్చాడు. లెనిన్918లో మొదటి ఆరునెలల్లో లెనిన్ ఉత్తరువులను అనుసరించి, కేవలం 22 మందినే చేకా చంపినట్లు అధికార నివేదికలో పేర్కొన్నారు. ఆ తరువాత ఆర్నెల్లలో ఆరు వేల మందిని ఉరితీశారు. 1919లో 10 వేల మందిని చంపేశారు. 1920 వచ్చే సరికి చేకా సంస్థకు చేతినిండా పని తగిలింది. ఆ యేడు 50 వేల మందిని ఉరితీసేశారు. ఇదంతా లెనిన్ ప్రోత్సాహం, ఆదేశాల మేరకే జరిగిన మారణకాండ. ఇలా చంపడంలో వ్యక్తిగతంగా విచారించే ప్రశ్నలేదు. వర్గాన్ని తుడిచి పెట్టడం ప్రధానం. ఈ సామూహిక హత్యలకు లెనిన్ పేర్కొన్న-వర్గాన్ని తుడిచిపెట్టాలన్న సూత్రమే మూలం.

 

తన అధికారానికి బయటా, లోపల తిరుగులేకుండా చెసుకోడానికి లెనిన్ చేయవలసిన దారుణ కృత్యాలన్నీ చేశాడు. జర్మనీవారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టి, లెనిన్ వారితో సంధి చేసుకున్నాడు. అంతటితో రష్యాకు జర్మనీ సైన్యాల బెడద ఆగింది. లెనిన్ రాక్షసకృత్యాలకు అంతరంగికంగా మరింత అవకాశం చిక్కింది. ఇందుకు అండగా నిలిచినవాడు స్టాలిన్. పనిచేయనివాడు తినడానికి వీల్లేదనే లెనిన్ సూత్రం రష్యాలో అన్వయించారు. సమ్మెలు నిషేధించారు. క్రమశిక్షణ లేని కార్మికులు, రౌడీలు, వూరికే తిరిగేవారు మొదలైన బాపతులను పట్టుకొని చెకా సంస్థ ఆధ్వర్యాన నిర్భందపనిలో పెట్టారు. విప్లవ ట్రిబ్యునల్స్ (నార్కండ్రడ్) ఈ నిర్ణయాలు తీసుకోగా అలాంటి వారితో రోడ్లు వేయడం, భవన నిర్మాణం, బండ్లు లాగడం యిత్యాది పనులెన్నో చేయించేవారు. విప్లవ వ్యతిరేకుల చేత అర్కిటిక్ ప్రాంతంలో నిర్భంద శ్రమ చేయించేవారు. లెనిన్ ప్రారంభించిన నిర్భంద శ్రామిక శిబిరాలు, అంతర్యుద్దానంతరం కూడా కొనసాగాయి. కార్మిక రాజ్యంలో కార్మికుల స్థితి లెనిన్ ఆధ్వర్వంలో అలా వుండేది. 1917లో భూముల్ని ఆక్రమించుకోవలసిందిగా లెనిన్ రైతుల్ని రెచ్చగొట్టాడు. 1918లో ఆ భూముల్ని రైతులనుండి లాగేసే ప్రయత్నం అదే లెనిన్ చేశాడు. 86 శాతం భూమి రైతుల చేతుల్లో వుండగా ప్రభుత్వ సమిష్టి వ్యవసాయానికి 11 శాతమే దక్కింది. ఇది చూచి 1918లో పంటను స్వాధీనం చేసుకోమంటూ లెనిన్ ఫాక్టరీ కార్మికులను పొలాల మీదకు పంపించాడు.

 

అధికారం కోసం మనుషుల్ని కిరాతకంగా హతమార్చి దానికి సిద్ధాంతపు తొడుగు చూపిన లెనిన్ ఈ శతాబ్దంలోని స్టేట్ టెర్రరిజానికి పితామహుడు. ఆయన్ను స్మరించకుండా టెర్రరిస్టు ఎవరూ తమ కృషిని సాగించలేరేమో. ( ఇటువంటి తీవ్ర భావజాలం ఉన్న వ్యక్తిని ఒక దైవాంశ సంభూతునిగా భారతదేశంలోని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్న కమ్మీలకు ఈ వ్యాసం అంకితం.)