పరిస్థితి అట్లుంది..మగ మహారాజులు జర పైలం!!!

 

ఆమెకు భర్త చనిపోయాడు.. మూడేళ్ల పసిబిడ్డతో తన పుట్టింటికి చేరింది.
అతనికి చక్కని భార్య , ఇద్దరు పిల్లలు, సర్కారు కొలువుతో కాస్త బాగానే ఉన్నాడు.

ఈ రెండు కథలు సరిగ్గా ఇక్కడే కలిసాయి. పుట్టింటికి వచ్చిన సదరు మహిళ అతనితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. పరస్పర అంగీకారంతో అన్ని సక్రమంగా జరిగిపోతున్నాయి. ఇక్కడ వరకూ ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ లేదు. ఒక్క అతని భార్యా పిల్లలకు తప్ప. కథ సక్రమంగా సాగిపోతున్న దశలో సదరు వితంతువుకు సడెన్ గా పెళ్లి మీదకు మనసు మళ్లింది. నన్ను పెళ్లి చేసుకుంటావా? చావమంటావా? అంటూ బ్లాక్‌మెయిలింగ్ కు దిగింది. అన్నీ తెలిసే శారీరక అవసరాల కోసం సంబంధం కొనసాగిస్తున్నప్పుడు నేను ఎలా పెళ్లి చేసుకుంటాను. అయినా నిన్ను పెళ్లి చేసుకుంటే నా భార్య ఊరుకుంటుందా? సమాజం ఊరుకుంటుందా? ఇవన్నీ ముందే తెలిసే నాతో సంబంధం పెట్టుకున్నావ్ కదా? ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావ్? అని అతను తన వెర్షన్ చెప్పాడు. వాస్తవానికి అతను వెర్షన్ న్యాయమైనది కూడా.

అయితే న్యాయమైన వెర్షన్ ను వినేందుకు ఆమె మామూలు ఆడది కాదు కదా.? పెళ్లి పిచ్చితో ఊగిపోతూ నాకు నచ్చిందే చేస్తా..నాకు నచ్చినట్టు ఉంటా అనే టైప్. ఇంకేముంది మనోడు సూప్ లో పడ్డాడు. ఎలా అంటే ఆమె బ్లాక్‌మెయిలింగ్ హద్దులు దాటిపోయింది. రిజర్వాయిర్ లు ఎక్కి దూకేస్తా అని బెదిరించింది. సర్ది చెప్పి తీసుకొచ్చారు. తల్లీ…నీకో దండం అంటూ చేసిన ఆ ఒక్క తప్పుకు లెంపలు వేసుకుని ఆమెను కలవడం మానుకున్నాడు సదరు మగాడు. అయినా సైకోయిజం ఆగలేదు. ఈ సారి ఇలా కాదని ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కింది. నన్ను పెళ్లి చేసుకుంటేనే కిందకు దిగుతా ..లేదంటే దూకి చస్తా అంటూ బెదిరింపులు షురూ చేసింది.

ఇక విషయం హద్దులు దాటిపోవడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగ ప్రవేశం చేసి అలాగే పెళ్లి చేయిస్తాం..కిందకు దిగు..అంటూ ఆమె కాళ్లూ వేళ్లూ పడ్డారు. మొత్తానికి ఆమె కిందకు దిగింది. అప్పటికే పరువు పోయి సగం చచ్చి ఉన్నాడు మన మగ మహారాజు. ఇంతకీ ఈ ఎపిసోడ్ లో ఈమె సాధించింది ఏముంది? పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకుని ఇప్పుడు ఇలా బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఈమెను ఏమనాలి? ఒకవేళ ఇలా పిచ్చి బ్లాక్‌మెయిల్‌లు, హౌరా మెయిల్ లు చేస్తూ , కేసులు పెట్టి ఈమె అతన్ని పెళ్లి చేసుకున్నా అతను ఈమెతో సంతోషంగా ఉంటాడా? ఈమెను దగ్గరకు రానిస్తాడా? ఈమె జీవితాంతం ప్రేమ దొరకని చోట ఇలా వాటర్ ట్యాంక్ లు ఎక్కుతూ కాలం వెళ్లదీస్తుందా? ఇంత చిన్న లాజిక్ లు మిస్ అవుతూ ఇలానే ఇప్పుడు చాలా మంది అపర కాళీలు ఇంటి ముందు ధర్నాలు, వాటర్ ట్యాంక్ లు, రిజర్వాయర్ లు ఎక్కుతూ తమకు తాము హాని చేసుకుంటున్నారు.

Mr.K