ఈ దేశంలో ‘లింగ సమానత్వం’ కావాల్సింది మగవాడికే!

ఆడవాళ్లను గౌరవించడం మనం సంప్రదాయం…బస్ లలో, క్యూలైన్స్ లో మనం ఈ లైన్స్ పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తాయి. ఆడవాళ్లను గౌరవించాల్సిందే…ఇందులో రెండో మాటకు తావు లేదు. తల్లిగా , చెల్లిగా, భార్యగా ఇలా విభిన్న పాత్రల్లో ఒక మగవాడి విజయం వెనుక ఆడదాని సహకారం ఉంటుంది. ఆడవాళ్లను ఎలా గౌరవించాలి అన్న విషయాన్ని పేరెంట్స్ కూడా తమ మగపిల్లలకు చిన్నతనం నుంచి కచ్చితంగా నేర్పించాలి. నేర్పిస్తున్నారు కూడా.

కానీ ఇటీవలి కాలంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. కానీ తగ్గడం లేదు. పోనీ ఇటువంటి దారుణాలకు పాల్పడిన వాళ్లకు అక్కా చెల్లెళ్లు లేరా? అంటే ఉన్నారు. పోనీ తల్లిదండ్రులు ఆడవాళ్లతో ఎలా మెలగాలో నేర్పించలేదా? అంటే అదీ లేదు. కానీ ఎందుకు ఇలా జరుగుతోంది. మన సమాజంలో వచ్చిన ఒక స్పష్టమైన మార్పు ఈ దుస్థితికి కారణంగా కనిపిస్తోంది.

పనిగట్టుకుని ఆడవాళ్లపై అఘాయిత్యాలు చేసే దుర్మార్గుల కోసం కాస్త పక్కన పెడదాం. మంచి కుటుంబంలో పుట్టి అక్కా చెల్లెళ్లతో పెరిగిన మగపిల్లలు కొందరు ఆడవాళ్లపై దాడి చేయడం, హత్య చేయడం వంటివి ఘటనలు జరుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? లోపం ఎక్కడ ఉంది? ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులు, ఆడపిల్లల ఆలోచనా విధానంలో చోటుచేసుకుంటున్న మార్పు దీనికి కారణంగా కనిపిస్తోంది.

ఒక మగవాడు ఒక అమ్మాయిని ప్రేమించి తర్వాత తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని చెపితే ఈ సమాజం, మహిళా సంఘాలు, పోలీస్ స్టేషన్లు అతన్ని దుయ్యబట్టేస్తాయి. అమ్మాయి అతని ఇంటి ముందు మౌన పోరాటం చేస్తుంది. పోలీసులు నిర్భయ కేసు పెడతారు? మహిళా సంఘాలు, మీడియా వాళ్లు మోసగాడు, దుర్మార్గుడు అంటూ హడావుడి చేస్తారు. సరే ప్రేమించి మోసం చేయడం తప్పే. మరి అదే అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి తర్వాత తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశంలేదని చెపితే ఈ సమాజంలో కనీసం ఒక్కరూ కూడా మాట్లాడరు. పైగా అతని తన బాధ చెప్పుకుంటే హేళన చేస్తారు. ఏడిస్తే చూసి నవ్వుతారు. అటువంటి సమయంలో అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఒక పక్క ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనే ఆవేదన? మరోవైపు తన గోడును వినే నాథుడు కూడా లేదనే ఆవేశం? ఇటువంటి సమయంలో అతను తన విచక్షణను కోల్పోయి మృగంలా మారితే దానికి భాధ్యత ఎవరిది?

ఆ ఆవేశంలో అతను అమ్మాయిపై దాడి చేస్తే మృగాడు, నరహంతకుడు, కిరాతకుడు అని మీడియా టీఆర్పీ కోసం హెడ్‌లైన్స్ వేసుకుంటుంది. అంతేకానీ అతను ఎందుకు అలా మారాడు? ఈ ఘటన జరగడానికి కారణమేంటని ఎవరైనా ఆరా తీస్తారా? తీయరు. ఒకవేళ అతని ఎవరిపైనా దాడి చేయకుండా తనకు తానే శిక్ష విధించుకుని ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తే ఎక్కడో న్యూస్ పేపర్ లో ఓ మూలన ‘ప్రేమ విఫలమై యువకుని ఆత్మహత్య’ అని చిన్న వార్త ప్రచురిస్తారు. అతను రెండు పేజీల సూసైడ్ నోట్ రాసినా, తన చావుకు ఎవరు కారణమో క్లియర్ గా రాసినా వార్తలో మాత్రం అమ్మాయి పేరును వెల్లడి చేయరు. ఎందుకంటే అమ్మాయి భవిష్యత్ పాడయిపోతుంది. చనిపోయినా అతని ఆత్మకు శాంతి కలగుకుండా అశాంతితో తిరిగేలా మరోసారి చంపుతారు.

అదే అమ్మాయి ప్రేమ విఫలమై సూసైడ్ చేసుకుంటే అది రైతుల ఆత్మహత్య, ఆకలి మరణాల కంటే పెద్ద వార్త అయి కూర్చుంటుంది. ‘మృగాడి దాష్టీకానికి అబల బలి’ అని పేపర్ వాళ్లు వీరావేశంతో రెచ్చిపోతారు. పోలీసులు నిర్భయ, భయ ఇంకా ఏవో చట్టాల బూజులు దులిపి అన్నీ బనాయించేస్తారు. ఆ తర్వాత అతనికి జీవితమే లేకుండా చేస్తారు. ఎందుకీ వివక్ష. తప్పు ఎవరు చేసినా తప్పే? తప్పుకు లింగ భేధాలు ఉండవు. మగవాళ్లలో దుర్మార్గులు ఎలాగైతే ఉంటారో..ఆడవాళ్లలో కూడా దుర్మార్గురాళ్లు ఉంటారు..ఆడ, మగ సమానం అని తెల్లారి లేచిన దగ్గర్నుంచి లెక్చర్లు దంచే మేథావులు ఈ విషయంలో ఆడ మగ సమానమని ఎందుకు గొంతెత్తరు. ఆడవాళ్లకు ఒక న్యాయం, మగవాళ్లకు ఇంకో న్యాయం? ఇటువంటప్పుడు సమాజం కలలు కంటున్న లింగ సమానత్వం ఎలా సాధ్యమవుతుంది. దయ చేసి ఆలోచించండి.

( ఇందులో ఆడవాళ్లను కించపర్చాలనే ఉద్దేశం మాకు ఏ కోశానా లేదు. ఆడవాళ్లు కోరుకుంటున్న లింగ సమానత్వం కోసమే మేం కూడా పాటుపడుతున్నాం.)