64 ఏళ్ల వయస్సులోనూ సిక్స్‌ప్యాక్ చూపిస్తున్న అగ్ర దేశాధినేత!

ఆయన వయస్సు 64 ఏళ్లు అయితేనేం మార్షల్ ఆర్ట్స్ చేయగలరు, జిమ్నాస్టిక్స్ అదరగొడతారు..ఎలాంటి నదినైనా ఈది పారేస్తారు…చొక్కా లేకుండా గంటల తరబడి చేపలు పడతారు. ఇంత ఉపోద్ఘాతం ఎవరికోసమే మీకు ఈ పాటికి అర్ధమై ఉండాలి. అర్ధం కాకుంటే ఈ స్టోరీ చదవండి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ ఉక్కు మనిషే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. చూడటానికి చాలా గుంభనంగా ఉన్నా ఆయన నిర్ణయం తీసుకున్నారంటే అగ్రరాజ్యం అమెరికాకు కూడా దిమ్మతిరగాల్సిందే.

ఎప్పుడూ చాలా గంభీరంగా కనిపించే పుతిన్ ఎన్నో విశిష్ఠమైన లక్షణాలు ఉన్నాయి. విభిన్న విషయాల్లో ప్రావీణ్యం ఉంది. మొన్నటికి మొన్న చైనా పర్యటనలో పియానో అద్భుతంగా వాయించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఆయన రష్యాలోని సుదూర ప్రాంతానికి వెళ్లి చేపలు పట్టడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అధ్యక్షుడు సరదాగా చేపలు పట్టడం కామనే కదా? ఇందులో హాట్ టాపిక్ ఏముంది అనుకోకండి. ఆయన చేపలు పట్టడానికి రష్యా రాజధాని మాస్కో నుంచి 3,700 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియాలోని రిపబ్లిక్ ఆఫ్ టివా ప్రాంతానికి వెళ్లి చేపలు పట్టారు.

అందరిలా గాలం పట్టుకుని ఒకచోట కూర్చుని చేపలు పట్టడం కాదు. పుతిన్ షర్ట్ విప్పేసి కౌబోయ్ క్యాప్ పట్టి చేపలు పట్టడంలో మునిగిపోయారు. తర్వాత నదిలోకి స్వయంగా దిగి ఈత కొట్టారు. నీటి అడుగుకు వెళ్లి చేపలు వేటను మరింత సీరియస్ గా చేసారు. పుతిన్ వయస్సు ప్రస్తుతం 64 ఏళ్లు. ఇప్పటికీ ఆయనకు సిక్స్ ప్యాక్ ఉండటం చూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ వయసులో కూడా ఆయన ఫిట్ గా ఉత్సాహంగా ఉండేందుకు ఏం చేస్తున్నారో అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. పుతిన్ చేపలు పడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.