థింక్ బిగ్..నిజంగా ఇది సక్సెస్‌ఫుల్ ఫార్ములాయేనా??

 

వ్యక్తిత్వ వికాసంలో థింక్ బిగ్ అనేది ఒక ముఖ్యమైన అంశం. లక్ష్యాలు, ఆశలు, కోరికలు ఉన్నతంగా ఉన్నప్పుడే మనిషి కసితో ఎదగడం సాధ్యపడుతుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే థింక్ బిగ్ కు వాస్తవికతను జోడిస్తేనే మనం అనుకుంటున్న ఎదుగుదల సాధ్యమవుతుంది. శరీరానికి వచ్చిన ఒక జబ్బుకు సరైన మందులు వేసుకోవడంతో పాటు అది నయమవుతుందన్న నమ్మకం, మంచి ఆహారం తీసుకున్నప్పుడే ఆ మందులు పనిచేస్తాయి. అప్పుడే ఫలితాలు వస్తాయి.

 

థింక్ బిగ్ విషయంలో కూడా అంతే. అంతులేని ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న తపనతో పాటు వాస్తవిక దృక్ఫధం చాలా అవసరం. లేదంటే అది అతి విశ్వాసానికి దారి తీస్తుంది. అతి విశ్వాసం ఒక మనిషిని సరైన మార్గం నుంచి పక్కదారి పట్టిస్తుంది. సరైన సమయంలో దాన్ని గుర్తించి సరిదిద్దుకోకపోతే చివరికి ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. థింక్ బిగ్ అనేది మనలో ఎప్పుడూ ఒక ఆరని జ్యోతిలా ఉండాలి కానీ దాన్ని ప్రదర్శించాలన్న ఆర్బాటం, తొందరపాటు అస్సలు పనికిరాదు.

 

ప్రస్తుతం చాలా మంది యువతరం ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. ఏదైనా కాస్త భారీగా, ఉన్నతంగా ఆలోచన చేస్తున్నారు. ఇది మంచిదే. కానీ దాన్ని ఉన్న ఫళంగా అందరికీ చూపించుకోవాలన్న ఆత్రం మంచిది కాదు. మన ప్రణాళికలు, మన లక్ష్యాలు..వాటిని ఆచరణలో పెట్టే వరకూ ఎవరికీ చెప్పాల్సిన, చూపించాల్సిన అవసరం లేదు. ఒక మంచి కారు వేసుకుని చక్కర్లు కొడితేనో లేక ఒక కాస్ట్‌లీ మొబైల్ వాడితోనో మనం థింక్ బిగ్ మనుష్యులం అయిపోం. థింక్ బిగ్ అనేది మన లక్ష్యం. దాన్ని కష్టపడి చేరుకున్నప్పుడు ఖరీదైన వస్తువులు వాటంతట అవే మన చెంతకు వస్తాయి.

 

సో నేను థింక్ బిగ్ మనిషిని అని చెప్పుకోవడానికి అవసరం లేని ఆర్భాటాలు చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకండి. అవసరం లేని వస్తువులు కొని ఇబ్బందులు పాలైతే మనం లక్ష్యం చేరుకోవడానికి మరింత ఆలస్యం అవుతుంది. డబ్బు నిర్వహణ కూడా తెలిసినప్పుడే లక్ష్యాన్ని సులువుగా సాధించగలం. ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్ చెప్పినట్టు మనం అవసరం లేని వస్తువులు కొని ఆడంబరాలు పోతే తర్వాత అవసరమైన వస్తువులు అమ్ముకోవాల్సి వస్తుంది. థింక్ బిగ్ కు వాస్తవితను జోడించి ఎవరికో ఏదో చూపించాలన్న ప్రచార మనస్తత్వాన్ని పొగొట్టుకుంటే మనదే విజయం.

మిస్టర్ కే