క్రెడిట్ స్కోరు ఫ్రీగా ఇస్తారు..కానీ..!

ఇప్పుడు క్రెడిట్ స్కోరు లేనిదే బ్యాంకులు కానీ ఆర్థిక సంస్థలు కానీ మనకు రుణాలు, క్రెడిట్ కార్డులు ఇవ్వడం లేదు. దీంతో క్రెడిట్ స్కోర్ అనేది ముఖ్యమైన విషయంగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకూ సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరోలకు డబ్బులు చెల్లించి మన క్రెడిట్ స్కోర్ వివరాలను తెలుసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఫైనాన్సియల్ టెక్నాలజీ సంస్థలు క్రెడిట్ రిపోర్ట్ ను లేదా స్కోర్ ను ఉచితంగానే ఇచ్చేస్తున్నాయి. కొన్ని సంస్థలు స్కోర్ వివరాలను తమ వెబ్‌సైట్లలలోనే డిస్‌ప్లే చేస్తుండగా మరికొన్ని సంస్థలు ఈమెయిళ్లు పంపుతున్నాయి. బ్యాంక్ బజార్ డాట్‌కామ్ సంస్థ క్రెడిట్ రిపోర్ట్ ను వెబ్‌సైట్ లో చూపించడంతో పాటు ఈమెయిల్ కూడా పంపుతోంది. అదే విధంగా పైసాబజార్ వెబ్‌సైట్లోనే రిపోర్ట్ ను చూపిస్తోంది. ఈ రెండు సంస్థలు ఎక్స్‌పీరియన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ద్వారా క్రెడిట్ బ్యూరో వివరాలను వెల్లడిస్తున్నాయి

ఇక పైసాబజార్ డాట్‌కామ్ అయితే మీ నివేదికకు సంబంధించి ఒక నెలవారీ అప్‌డేట్ ను కూడా మెయిల్ చేస్తోంది. అదే విధంగా క్రెడిట్ మంత్రి డాట్ కామ్ అనే సంస్థ మీ క్రెడిట్ స్కోర్ ను వెబ్‌సైట్ లో చూపిస్తోంది. ఈ సైట్ లో పూర్తి వివరాలు కావాలంటే రూ.199 ( పన్నుల మినహాయించి) ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ ఈక్విఫ్యాక్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ నుంచి వివరాలను తీసుకుంటోంది. అదే విధంగా ఇండియా లెండ్స్ అనే సంస్థ కూడా స్కోరును వెబ్‌సైట్లో ఉచితంగా చూపిస్తోంది.

వినియోగదారులపై ఈ సంస్థలకెందుకింత ప్రేమ?

తమ ఖాతాదారుల పరిమాణాన్ని పెంచుకునేందుకు ఈ క్రెడిట్ బ్యూరో సంస్థలు ఈ ఉచితం బాట పట్టాయి. ఇందులో భాగంగానే ఫైనాన్సియల్ టెక్నాలజీ సంస్థలతో జతకట్టాయి. ఫిన్‌టెక్ సంస్థలకు వినియోగదారుని అవసరాలు తెలిస్తే వారికి అనువైన రుణాన్ని అందేలా చేయడానికి తద్వారా తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలు కలుగుతుంది. వాళ్ల వ్యాపార వ్యూహాలు ఎలా ఉన్నా కానీ వినియోగదారులు కూడా తమ స్కోర్ ను పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రుణం తొందరగా పొందేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది.

ప్రపంచంలో ఏదీ ఉచితం కాదు!

ఫైనాన్సియల్ టెక్నాలజీ సంస్థలు ఇస్తున్న ఈ ఉచిత రిపోర్ట్ ల వెనుక పెద్ద కథ ఉంటుంది. వాళ్లకు మీ వివరాలను మొత్తం వెల్లడిస్తేనే క్రెడిట్ స్కోర్, రిపోర్ట్ ఫ్రీగా వస్తుంది. పేరు, అడ్రస్, పాన్ నెంబర్ ఇలా సమస్త సమాచారాన్ని వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ద్వారా ఆ సంస్థలు మీ క్రెడిట్ హిస్టరీని తెలుసుకుని మీకు వాటి ఉత్పత్తుల విక్రయించేందుకు వాడుకుంటాయి. ఏదో ఉచితంగా వస్తుంది కదా అని మీ ఆదాయ వివరాలు, పాన్ నెంబర్, వ్యక్తిగత వివరాలను థర్డ్ పార్టీలకు గుడ్డిగా ఇచ్చేయకండి. కొన్ని జాగ్రత్తలు తీసుకుని మీ డేటా భధ్రంగా ఉంటుందని తెలుసుకున్న తర్వాతే వివరాలు ఇవ్వాలి. ఈ విషయంలో కొంచెం తీరిక చేసుకుని ఆయా కంపెనీల నియమ నిబంధనలను కూలంకుషంగా చదవాలి. ఏమైనా సందేహాలు ఉంటే వాళ్లకు ఫోన్ చేసి తీర్చుకోవాలి. అప్పుడే వివరాలను ఇవ్వాలి. అలా కాకుండా ఏదో ఫ్రీగా ఇస్తున్నారు కదా అని అందరికీ మీ వివరాలను సమర్పించుకోకండి.