బీమాయే మీ కుటుంబానికి ధీమా!

ప్రతీ ఒక్కరూ తమ కుటుంబ సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తారు. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా ఏం చేసినా తనపై ఆధారపడిన వారికి మంచి జీవితాన్ని అందించాలని తాపత్రయపడుతూ ఉంటారు. కానీ సరైన ఆర్థిక ప్రణాళిక లేనప్పుడు వారి ఆశలు, కలలు తలకిందులవుతాయి. బాధ్యత అంటే డబ్బు సంపాదిస్తూ కుటుంబాన్ని ఆనందంగా, సౌకర్యవంతంగా చూసుకోవడమే కాదు, ఒకవేళ అనుకోని ఆపద ఎదురై తాము లేకున్నా తమ కుటుంబం అంతే సౌకర్యవంతంగా బతికేలా తగిన ఏర్పాటు చేయడమే నిజమైన బాధ్యత అనిపించుకుంటుంది.

ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడంతో మన దేశంలో కొత్త తరం యువకులు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. భవిష్యత్ గురించి అందమైన కలలు కంటూ సౌకర్యవంతంగా, సుఖంగా బతికేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది కానీ భవిష్యత్ ప్రణాళిక అంటే అది ఆర్థిక ప్రణాళిక అన్న విషయం మర్చిపోతున్నారు. సరైన ఆర్థిక ప్రణాళిక లేకుంటే మన భవిష్యత్ ప్రణాళికలు ప్రమాదంలో పడతాయి. ముఖ్యంగా బీమా తీసుకునే విషయంలో అధిక శాతం మంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అవగాహన లేమి, బాధ్యతా రాహిత్యం కారణాలు ఏమైతే కానీ తమ తదనంతరం తమ కుటుంబానికి తగిన ఆర్థిక భధ్రత కల్పించడంలో విఫలమవుతున్నారు.

బీమా, పొదుపు కలగలిపి ఉన్న సంప్రదాయ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుని అటు తగిన బీమా భద్రత లేకుండా ఇటు తగిన ఆర్థిక భధ్రత లేకుండా స్వీయ పొరపాట్లు చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం టెర్న్ ఇన్సూరెన్స్. మన భాధ్యతలు, రుణాలకు సరిపడినంత మేర బీమా రక్షణను అందించడంలో టెర్మ్ ఇన్సూరెన్స్ మనకు ఉపయోగపడుతుంది.

టెర్మ్ ఇన్సూరెన్స్ ను ఎంత తీసుకోవాలి?

ఉదాహరణకు మనీష్ వయస్సు 30 ఏళ్లు. అతను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నెలకు 60వేల రూపాయలు సంపాదిస్తాడు. ఇక మనీష్ కు భార్య , 6 నెలల వయస్సు ఉన్న పాప ఉన్నారు. తన సంపాదనలో అధిక భాగం ఇంటి అద్దె, గ్రాసరీస్, ఎంటర్‌టైన్‌మెంట్ కే ఖర్చు అవుతోంది. అలాగే కొద్ది మొత్తం పాప హయ్యర్ ఎడ్యుకేషన్, తన రిటైర్‌మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ వరకూ బాగానే ఉంది. కానీ మనీష్ అత్యవసరంగా చేయాల్సిన పని తగిన మొత్తానికి టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. అయితే ఎంత మొత్తానికి టెర్మ్ ఇన్సూరెన్స్ ను తీసుకోవాలి అని చాలా మందికి సందేహం వస్తుంది. ఇది చాలా సులువైన విషయం. ఒక వ్యక్తి ఏడాదికి ఎంత మొత్తం సంపాదిస్తున్నాడో దానికి పదిరెట్లు ఉండేలా టెర్మ్ ఇన్సూరెన్స్ ను తీసుకోవాలి. ఇక మనీష్ ఏడాది సంపాదన 7 లక్షలు. అంటే అతను 70 లక్షలకు టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీని వలన అతనికి ఏమైనా జరిగినా అతనిపై ఆధారపడిన కుటుంబం ప్రస్తుతం గడుపుతున్న సౌకర్యవంతమైన జీవితాన్ని రానున్న రోజుల్లోనూ గడిపేందుకు అవకాశం ఉంటుంది. టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాకే అవసరాలకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక వేసుకుని తగిన మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ పోవాలి.

టెర్మ్ ఇన్సూరెన్స్ ను ఎక్కడ తీసుకోవాలి?

మార్కెట్లో దాదాపు 40 కి పైగా కంపెనీలు టెర్మ్ ఇన్సూరెన్స్ ను అందిస్తున్నాయి. అయితే తక్కువ మొత్తానికే వస్తున్నాయని కంపెనీ చరిత్ర, ఇతర వివరాలు తెలుసుకోకుండా టెర్మ్ ఇన్సూరెన్స్ ను తొందరపడి తీసుకోకూడదు. ముఖ్యంగా కంపెనీ ఆర్థిక చరిత్ర, ఇతర వివరాలు తెలుసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఆ కంపెనీ గతంలో ఇచ్చిన క్లయిమ్ సెటిల్‌‌మెంట్ నిష్పత్తిని నిశితంగా గమనించాలి. ఎక్కువ క్లైయిమ్ లు వచ్చినప్పుడు చిన్న కంపెనీలు క్లైయిమ్ లను సెటిల్ చేయడంలో ఇబ్బందులు పడతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఎక్కువ రోజుల నుంచి మార్కెట్లో కొనసాగుతున్న, ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీలకు ఎంచుకోవాలి. పాలసీ తీసుకునేటప్పుడే ఎటువంటి గోప్యత లేకుండా మీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలను కంపెనీలకు వెల్లడించాలి.

ఆన్‌లైన్ పాలసీలు సురక్షితమేనా?

మార్కెట్లో ఇప్పుడు ఆన్‌‌లైన్ లో టెర్మ్ పాలసీలు దొరుకుతున్నాయి. అయితే ఆన్‌లైన్ పాలసీలు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు వెల్లడించకుండానే చాలా కంపెనీలు పాలసీలు అమ్ముతున్నాయి. దీని వలన పాలసీదారుడు క్లైయిమ్ కు వచ్చే సమయంలో నష్టపోయే అవకాశం ఉంది. ఆన్‌లైన్ పాలసీల కంటే ఫైనాన్సియల్ సంస్థల దగ్గర, ప్లానర్స్ దగ్గర నుంచి పాలసీలు తీసుకోవడమే ఉత్తమం. సేవాపరమైన ఇబ్బందులు తలెత్తినప్పుడు ఆ సంస్థ లేదా వ్యక్తి పాలసీదారుకు అండగా ఉండటమే కాక అనుకోని విపత్తు సంభవించినప్పుడు కుటుంబానికి క్లైయిమ్ అందేలా పనిచేస్తారు. కేవలం కస్టమర్ కేర్ ను నమ్ముకుని జీవితానికి చాలా ముఖ్యమైన టెర్మ్ పాలసీని తీసుకోవడం అంత తెలివైన పనికాదు. ఆఫ్‌లైన్ లో పాలసీ తీసుకున్నప్పుడు ప్రీమియం 500 నుంచి 700 రూపాయలకు వరకూ పెరిగినా సంస్థ లేదా వ్యక్తి ద్వారా టెర్మ్ ఇన్సూరెన్స్ ను తీసుకోండి. అలాగే 85 ఏళ్ల వరకూ టెర్మ్ ను ఎంచుకున్నప్పుడు జీవితాంతం ప్రీమియం చెల్లించే విధానం కాకుండా లిమిటెడ్ ఆప్షన్ ను ఎంచుకుని మీకు అదాయం ఉన్నంత వరకూ అంటూ ఒక పదేళ్లు మాత్రమే ప్రీమియం చెల్లించే విధంగా కవరేజీ జీవితాంతం ఉండేలా పాలసీని ఎంచుకోవాలి. దీని వలన మొత్తం చెల్లించాల్సిన ప్రీమియం సగానికి పైగా తగ్గడంతో పాటు ఆదాయం లేనప్పుడు కూడా లైఫ్ కవరేజీ కొనసాగుతుంది. ఏడాదికి చెల్లించాల్సిన ప్రీమియం కాస్త ఎక్కువగా అనిపించినా లిమిటెడ్ పే ఆప్షన్ ను ఎంచుకోవడమే ఉత్తమం.

వెంకట్ కంబాల, ఫైనాన్సియల్ అడ్వైజర్,

వెల్త్ సెంటర్

733 099 6656